Rakul Preet Singh About Career Struggles: ముందుగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత వెంటనే బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయిన భామలు ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్‌లో లక్ కలిసిరాని ఎంతోమంది హీరోయిన్స్‌కు బాలీవుడ్.. స్టార్ స్టేటస్‌ను అందించింది. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. రకుల్ ఒక తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయ్యింది. ప్రస్తుతం తను బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా అయిపోయింది. కానీ కెరీర్ మొదట్లో ప్రభాస్, నాగచైతన్య లాంటి హీరోలతో నటించే ఛాన్స్ ఎలా మిస్ చేసుకుందో బయటపెట్టింది ఈ భామ.


సౌత్ ఇండస్ట్రీ తెలియదు..


మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది రకుల్. అసలు తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. ‘‘మిస్ ఇండియా పోటీల కంటే ముందే నాకు మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక కన్నడ మూవీ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పటికి అసలు సౌత్ ఇండస్ట్రీ అనేది ఉంటుందనే నాకు తెలియదు. నేను టీవీ, సినిమాలు అసలు చూసేదాన్ని కాదు. సౌత్ అంటే అసలు బాగుండదేమో అనుకున్నాను. అందుకే ఆ మూవీని రిజెక్ట్ చేశాను. కానీ వాళ్లు మా నాన్నను అడగడం మొదలుపెట్టారు. నా పుట్టిన తేదీని బట్టి నేను పెద్ద స్టార్ అవుతానని నా జాతకంలో రాసుందని ఆ నిర్మాత నన్ను కచ్చితంగా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని పట్టుబట్టాడు’’ అని రకుల్ గుర్తుచేసుకుంది.


చిన్న రోల్ మాత్రమే..


7జీ బృందావన్ కాలనీ మూవీ కన్నడ రీమేక్ అయిన ‘గిల్లీ’తో రకుల్ హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే ఒరిజినల్ వెర్షన్‌లో క్లైమాక్స్ చూసిన తర్వాత ఏడ్చేసి సినిమా చేయనని చెప్పానని రకుల్ తెలిపింది. కానీ క్లైమాక్స్ మార్చడంతో, లక్షల్లో రెమ్యునరేషన్ వస్తే కారు కొనుక్కోవచ్చు అనే ఆశతో మాత్రమే మూవీ చేశానని బయటపెట్టింది. ఆ తర్వాత తనకు తెలుగు నుంచి కూడా కాల్స్ వచ్చాయని, వాళ్లు ఫ్లైట్ టికెట్స్ పంపగానే వచ్చి మేకర్స్‌ను కలిసి వెళ్లిపోయేదాన్ని అని గుర్తుచేసుకుంది. 60 రోజులు షూటింగ్ అని చెప్తే.. తనకు తెలియక చిన్న రోల్ ఉంటే ఇవ్వమని అడిగేదాన్ని అని చెప్పి నవ్వింది. తనకు అసలు యాక్టింగే రాదని, హీరోయిన్‌గా కెరీర్ ఉంటుందని ఊహించలేదని చెప్పుకొచ్చింది రకుల్.


పూరీ జగన్నాధ్ అలా అన్నారు..


‘‘పోకిరి తర్వాత పూరీ జగన్నాద్ కాల్ చేశారు. 100 రోజులు కావాలన్నారు. తెలుగు రాదు కాబట్టి ట్రైనింగ్ ఇస్తామన్నారు. చదువును పక్కన పెట్టడం ఇష్టం లేక నో చెప్పాను. అయితే డిగ్రీ సాధిస్తే మెడలో వేసుకొని తిరగదు కదా అని పూరీ మా నాన్నతో అన్నారు. అయినా నేను పట్టించుకోకుండా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్లేదాన్ని. నేను వస్తున్నాను, వెళ్తున్నాను, ఏది సైన్ చేయడం లేదని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే నేను ఒక పెద్ద మూవీకి సైన్ చేశాను. కానీ నాలుగు రోజుల షూటింగ్ తర్వాత నన్ను మార్చేశారు. అదే ‘మిస్టర్ పర్ఫెక్ట్’. అప్పట్లో నాకు ఆ మూవీ విలువ తెలియదు. ఆటోనగర్ సూర్యకు కూడా అలాగే జరిగింది. అప్పుడు నాకు బాధ అనిపించి, కచ్చితంగా ఈ కెరీర్ కావాలి అనుకున్నాను’’ అంటూ గుర్తుచేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.


Also Read: నటుడు షాయాజీ షిండేకు తీవ్ర ఆస్వస్థత - ఏమైందంటే!