'రామన్న యూత్' సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు అభయ్ నవీన్ (అభయ్ బేతిగంటి) ఇప్పుడు మరో సినిమా చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రాక్షస కావ్యం' (Rakshasa Kavyam Movie). ఇందులో అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ఇతర ప్రధాన తారాగణం. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమాను శింగనమల కళ్యాణ్ నిర్మించారు. సినీ వ్యాలీ మూవీస్ సంస్థను స్థాపించిన ఆయన... ఇంతకు ముందు 'భాగ్ సాలే' నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఇప్పుడు దాము రెడ్డితో కలిసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ భాగస్వామ్యంతో 'రాక్షస కావ్యం' చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.... 


''నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా... సినిమాలపై ఇష్టం తగ్గలేదు. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో పని చేశా. 15 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా. మధుర శ్రీధర్ రెడ్డి ద్వారా దాము రెడ్డి పరిచయం అయ్యారు. 'రాక్షస కావ్యం' కథ నచ్చడంతో నిర్మించడానికి ముందుకు వచ్చా''.


తెలంగాణ నేపథ్యంలో రస్టిక్ సినిమా
''తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ మూవీగా 'రాక్షస కావ్యం' చిత్రాన్ని తీద్దామని చెప్పారు. కథ సహజంగా ఉంటుంది. ఎక్కువ మెలోడ్రామా లేదు. నిజ జీవితాన్ని తెరపై చూస్తున్న అనుభూతి ఉంటుంది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ళ జీవన శైలి కనిపిస్తుంది. తాగుడుకు బానిసైన కొంత మంది పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తుంటారు. ఆ విషయాలు అన్నీ చూపించాం''


హీరోలే ఎందుకు గెలవాలి?
''సాధారణంగా సినిమాల్లో ఎప్పుడూ హీరోలే ఉంటారు. అయితే... ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి? విలన్స్ గెలవాలనే పాయింట్ కూడా కొత్తగా, కామెడీగా ఉంటుంది. సినిమాల్లో విలన్లను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారని వివరించే సన్నివేశాలు సరదాగా ఉంటాయి''


'రాక్షస కావ్యం'కు, పురాణాలకు... 
''కైలాసగిరికి ఓ ఋషి వస్తున్నప్పుడు ఇద్దరు ద్వారపాలకులు అడ్డుకుంటారు. అప్పుడు రుషి ఆగ్రహించి శపిస్తాడు. మీ దేవుడికి భక్తులుగా పుట్టి పది జన్మలు ఎత్తుతారా? లేక దేవుడికి శత్రువులుగా పుట్టి మూడు జన్మలు ఎత్తుతారా? అని అడుగుతాడు. తమ దేవుడిని చూడకుండా ఉండలేమని, అందుకని రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తుతామని చెబుతారు. అలా జన్మించిన వారు రామాయణంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, మహాభారతంలో శిశుపాలుడు, కంసుడు. ఆ ఇద్దరు ద్వారపాలకులు కలియుగంలో మళ్లీ పుట్టారని... ఒకరు హీరోల కంటే విలన్లను ఇష్టపడితే? మరొకరు రాక్షసంగా అందర్నీ చంపే రౌడీగా కనిపిస్తాడు. అదీ మా కథ. దర్శకుడు శ్రీమాన్ చాలా సహజంగా తెరకెక్కించారు''


Also Read :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?


''సినిమాలో అన్వేష్ కామెడీ బాగా చేశాడు. ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. అభయ్ నవీన్ సీరియస్ రౌడీ రోల్ చేశారు. ఇద్దరూ బాగా నటించారు. అక్టోబర్ 13న మా సినిమాను విడుదల చేస్తున్నాం. థియేటర్లు కూడా ఎక్కువ లభిస్తున్నాయి. మా సినీ వ్యాలీ మూవీస్ సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు చేయబోతున్నాం''


చైతన్య రావు హీరోగా సంజీవ్ దర్శకత్వంలో...
''ప్రస్తుతం టాంగా ప్రొడక్షన్స్ విజయ్ మట్టపల్లి భాగస్వామ్యంతో చేస్తున్న 'ప్రేమ కథ'ను నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇంకో సినిమాను క్రిస్మస్ లేదా జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా సంస్థలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో చైతన్య రావ్ హీరోగా కొత్త సినిమాను అక్టోబరులో ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచన ఉంది. ప్రస్తుతం హీరోలతో చర్చలు జరుపుతున్నాం''


Also Read 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : 'కలర్స్' స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial