Rakkayie Title Teaser : లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా నుంచి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. వరుస సినిమాలతో అలరిస్తున్న నయనతార పుట్టినరోజు సందర్భంగా "రక్కయీ" అనే మూవీని అనౌన్స్ చేశారు. సెంథిల్ దర్శకత్వంలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది ఈ మూవీ. సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను తెలుపుతూ టైటిల్ టీజర్ ను నేడు విడుదల చేశారు. డ్రం స్టిక్స్ ప్రొడక్షన్, మూవీ వెర్స్ ఇండియా బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
టైటిల్ టీజర్ చూస్తే.. ఈ సినిమాలో నయనతార పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓ చిన్న పాపకి పాలు పడుతూ సాధారణ గృహిణిలా టీజర్ మొదట్లో కనిపించింది నయనతార. అయితే చాలామంది కత్తులు, కాగడాలతో ఆమె ఇంటి పైకి దాడికి రావడం, నయనతార కూడా ఆ తర్వాత అపరకాళీలా మారి, కొడవళ్లతో యుద్ధానికి దిగడం సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. అంతేకాకుండా టీజర్ లో ఉన్న నయనతార కట్టూ బొట్టూ ఆసక్తికరంగా ఉన్నాయి. టీజర్ లో ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం పంచ్ ప్యాక్ లా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ఈ టీజర్ తో లేడీస్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, గౌతం రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్లను వెల్లడించే అవకాశం ఉంది.
ఇక మరోవైపు నయనతార తన పుట్టినరోజు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినార్ ను ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. భర్త విగ్నేష్ శివన్ తో పాటు ఇద్దరు పిల్లలతో ఆదివారం నయనతార కుతుబ్ మినార్ దగ్గర సందడి చేశారు. ఇక మరోవైపు ప్రస్తుతం నయనతార, ధనుష్ పై చేసిన విమర్శల వివాదం హాట్ టాపిక్ గా మారింది. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ రూపంలో ఆమె పెళ్లితోపాటు సినిమా జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూపించబోతున్నారు.
నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేను రౌడీనే' మూవీ క్లిప్పింగ్ ని పర్మిషన్ లేకుండా ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయనతార టీం. దీంతో ధనుష్ టీం 10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు పంపడంతో ఆమె ధనుష్ ని టార్గెట్ చేస్తూ ఏకంగా ఓ బహిరంగ లేఖను రిలీజ్ చేసింది. మొత్తానికి నయనతార బర్త్ డేకి ముందు జరిగిన ఈ వ్యవహారం తమిళ చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి