Rajinikanth and Nelson reunite for Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది 'జైలర్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్ కి 'జైలర్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రజనీకాంత్ కెరియర్ లోనే కాకుండా గత ఏడాది కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో మళ్లీ వింటేజ్ రజినీకాంత్ ని చూపించాడు దర్శకుడు నెల్సన్. దాంతో ఎంతోకాలంగా అసంతృప్తిలో ఉన్న అభిమానులు ఈ సినిమాతో పండగ చేసుకున్నారు.


ఎన్ని ప్లాప్స్ వచ్చినా సూపర్ స్టార్ కి సరైన సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందనే మాట మరోసారి నిరూపితమైంది. 'జైలర్' ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కోలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ నెల్సన్ రజనీకాంత్ ని సినిమాలో ఊర మాస్ రేంజ్ లో ప్రజెంట్ చేయడం, సూపర్ స్టార్ ఎలివేషన్స్, దానికి అనిరుద్ ఇచ్చిన బిజీయం, సునీల్, యోగి బాబు కామెడీ, తమన్నా గ్లామర్.. ఇలా అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. వీటన్నింటికీ తోడు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ మాస్ ఎంట్రీ, మలయాళం స్టార్ మోహన్ లాల్ స్పెషల్ అప్పీయరెన్స్ థియేటర్స్ లో పూనకాలు తెప్పించాయి.


అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. జైలర్ సీక్వెల్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ జైలర్ సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన 'జైలర్ 2' స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. రజనీకాంత్ ప్రజెంట్ దర్శకత్వంలో 'వేటయాన్' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే 'జైలర్ సీక్వెల్' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ నుంచి సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఈసారి సీక్వెల్ ని అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడట.


త్వరలోనే జైలర్ సీక్వెల్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రజినీకాంత్ వెట్టయాన్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు నుంచి రానా ద‌గ్గుబాటి ఈ మూవీలో నటిస్తుండగా, మ‌లయాళం నుంచి ఫ‌హాద్ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ సైతం మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో 'వెట్టయాన్' భారీగా అంచనాలు నెలకొన్నాయి.


Also Read : వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు