తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. గత ఎన్నికల సమయంలో రజినీకాంత్ పార్టీ ఏర్పాటుకు అంతా రెడీ అయ్యింది. అభిమానులతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు.. అభిమాన సంఘం నాయకులతో పార్టీకి సంబంధించిన చర్చలు జరిగాయి. రజినీకాంత్ పార్టీ ఏర్పాటు ఖాయం, ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే చర్చ బలంగా సాగింది. రాజకీయ పార్టీ అతి త్వరలో ఉంటుందని అభిమానులు వెయిట్ చేస్తున్న సమయంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదంటూ సూపర్ స్టార్ షాక్ ఇచ్చారు. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రజినీకాంత్ మౌనంగా ఉంటూ వచ్చారు. ఆరోగ్యం సహకరించని కారణంగానే ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరిగింది. రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణాలపై రజినీ ఎట్టకేలకు స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది. ఆ సమయంలో నేను అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ డాక్టర్ రవిచంద్రన్ మాత్రం నా ఆరోగ్యం విషయంలో హెచ్చరించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆయన జోక్యం చేసుకోలేదు. కానీ ప్రచారానికి దూరంగా ఉండాలని, ప్రజలకు దూరంగా ఉండాల్సిందేనని అన్నారు. జనాలకు కనీసం 10 అడుగుల దూరంలో ఉండటంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో జనాలకు దూరంగా ఉంటూ మాస్క్ ధరించి సభలు సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని భావించాను. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నాకు రాజకీయాలంటే భయం అన్నారు. రాజకీయంగా ఒత్తిడి అన్నారు. కానీ నేను కుటుంబ సభ్యులు, వైద్యుల హెచ్చరికల కారణంగానే రాజకీయ ప్రకటన రద్దు చేసుకున్నా’’ అని రజినీకాంత్ చెప్పారు.
‘జైలర్’గా సూపర్ స్టార్
రజినీకాంత్ ఈ మధ్య కాలంలో బిగ్ కమర్షియల్ హిట్ ను అందుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా కూడా ఆయన వరుస సినిమాలను చేస్తున్నారు. చాలా కాలంగా సూపర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న సూపర్ హిట్ కోరికను ‘జైలర్’ సినిమాతో తీర్చాలని భావిస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ఆ సినిమాను ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా తోఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నారు. అదే తరహా లో రజినీకాంత్ కూడా ఒక భారీ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ‘జైలర్’ సినిమా తో నెరవేరబోతుందా అనేది చూడాలి.
రజినీకాంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. ఆ సినిమాల కథా చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రజినీకాంత్ తదుపరి సినిమా కూడా ఇదే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. సీనియర్ దర్శకులతో పాటు యంగ్ దర్శకులతో కూడా ఈ సూపర్ స్టార్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.