Rajamouli: ‘కల్కి 2898 AD’ సినిమాలో మేకర్స్ రివీల్ చేసిన పాత్రలకంటే రివీల్ చేయని పాత్రలే చాలా ఉన్నాయి. అందుకే మొదటి రోజు మూవీ చూసినవారు ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వకూడదని ప్రేక్షకులను కోరింది ‘కల్కి 2898 AD’ టీమ్. కానీ చాలామంది ప్రేక్షకులు.. వారి రిక్వెస్ట్‌ను పట్టించుకోకుండా సినిమాలో ఎవరెవరు గెస్ట్ రోల్స్ చేశారు, ఎలాంటి పాత్రల్లో కనిపించారు అనే విషయాన్ని బయటపెట్టేశారు. ఇక ‘కల్కి 2898 AD’ క్లైమాక్స్‌లో ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తాడనే విషయం కూడా ఓపెన్ సీక్రెట్‌గా మారిపోయింది. అయితే ప్రభాస్.. ఈ పాత్రలో బాగుంటాడని రాజమౌళి ఎప్పుడో గెస్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


కర్ణుడు ఇష్టం..


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’తోనే ప్యాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. హీరోగా ప్రభాస్, దర్శకుడిగా రాజమౌళి కెరీర్లను ప్రారంభించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే పురాణ ఇతిహాసాల్లోని పాత్రల్లో తనకు కర్ణుడు అంటే ఇష్టమని ఇప్పటికే చాలాసార్లు బయటపెట్టారు రాజమౌళి. కొన్నాళ్ల క్రితం ఆయన పాల్గొన్న ఒక ఈవెంట్‌లో మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. అసలు కర్ణుడు అంటే తనకు ఎందుకు ఇష్టమో చెప్పుకొచ్చారు. ‘‘కర్ణుడు లాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో ఉంటారని నేను అనుకోను. అలాంటి క్యారెక్టర్ ఎవరూ ఉండరు’’ అంటూ రియల్ లైఫ్‌లో కర్ణుడు అనేవారు అసలు ఉండరని కచ్చితంగా చెప్పారు రాజమౌళి.


ఇప్పుడు నిజమయ్యింది..


‘‘కర్ణుడు లాంటి క్యారెక్టరైజేషన్, నమ్మినదాన్ని గట్టిగా పట్టుకొని, తనకు ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా అలా ఉండడం అనేది చాలా కష్టం. రియల్ లైఫ్‌లో అలా ఎవరూ ఉండలేరు. రియల్ లైఫ్‌లో ఉండేవి కూడా నాకు పెద్దగా ఇష్టముండదు. అలాంటి క్యారెక్టర్ కాబట్టి కర్ణుడు అంటే నాకు అంత ఇష్టం’’ అంటూ కర్ణుడి గురించి చెప్పుకొచ్చారు రాజమౌళి. రియల్ లైఫ్ పక్కన పెడితే.. రీల్ లైఫ్‌లో అలాంటి క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు అనే ప్రశ్న రాజమౌళికి ఎదురయ్యింది. ‘‘ప్రభాస్‌కు ఇస్తాను. తనే కరెక్ట్’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు దర్శక ధీరుడు. అయితే అప్పట్లో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఇప్పుడు నిజమయ్యింది అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


క్లైమాక్సే హైలెట్..


‘కల్కి 2898 AD’ మూవీ క్లైమాక్స్‌కు వచ్చేవరకు అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? మహాభారతంలోని పాత్రల్లో ప్రభాస్ ఏ పాత్రలో కనిపిస్తాడు? అనే ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. చివరిగా భారీ ఎలివేషన్స్‌తో కర్ణుడిగా ప్రభాస్‌ను రివీల్ చేశాడు. దీంతో అప్పటివరకు ఆడియన్స్‌లో క్రియేట్ అయిన ఆసక్తి.. సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ‘కల్కి 2898 AD’ మూవీ అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్ మాత్రమే ఒక ఎత్తు అని చాలామంది ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. ముందుగానే దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్టుగా.. చివరివరకు ప్రభాస్ పాత్ర గురించి అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సెకండ్ పార్ట్‌లో ఈ పాత్రను ఫుల్‌గా చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.



Also Read: ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడ్డాను, బయటికి పారిపోయాను - షాలిని పాండే