Rajamouli: తెలుగు సినిమా స్థాయిని మార్చిన దర్శకుడు ఎవరంటే క్షణం కూడా ఆలోచించకుండా రాజమౌళి అని చెప్పేయొచ్చు. అందుకే తన ఫ్యాన్స్ అంతా ఆయనను ప్రేమగా దర్శక ధీరుడు, జక్కన అని పిలుచుకుంటూ ఉంటారు. ‘మగధీర’ సినిమా దగ్గర నుండి బడ్జెట్ విషయంలో రిస్కులు తీసుకుంటూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఆ తర్వాత ‘బాహుబలి’ అంటూ దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు వినిపించేలా చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ వల్ల రాజమౌళి ఖాతాలోకి మరో రికార్డ్ వచ్చి చేరింది.


ఆస్కార్ అవార్డ్..


రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’కు తమ నటనతో ప్రాణం పోశారు ఎన్‌టీఆర్, రామ్ చరణ్. అందుకే ఇద్దరూ గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ఇక ఈ సినిమాను మరొక స్థాయికి తీసుకెళ్లిన వారిలో కీరవాణి కూడా ఉంటారు. అందుకే ఆయన సంగీతం అందించిన ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఇన్నేళ తెలుగు సినీ చరిత్రలో ఒక టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి. అందుకే తెలుగు ప్రేక్షకులంతా ఈ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి రాజమౌళి అండ్ టీమ్‌కు పిలిచి మరీ మరో బాధ్యతను అప్పగించింది ఆస్కార్.


థాంక్యూ ఆర్ఆర్ఆర్..


ఆస్కార్ అవార్డులకు ఓటర్లుగా వ్యవహరించడం కోసం తమకు ఆహ్వానం దక్కిందంటూ రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ‘‘ది అకాడమీకి ఓటర్లుగా మాకు ఆహ్వానం దక్కింది. పెద్దన్న, తారక్, చరణ్, సబు సార్, సెంథిల్, చంద్రబోస్ గారు. ఇప్పుడు ప్రేమ్, రమ, నేను. ఒక్క సినిమా.. దానికోసం పనిచేసిన 9 మందికి గుర్తింపును తీసుకొచ్చింది. థాంక్యూ ఆర్ఆర్ఆర్’’ అని రాజమౌళి పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు.






ఎనర్జిటిక్ స్టెప్పులు..


‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట వినడంకంటే చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎనర్జీ ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇలాంటి ఒక ఎనర్జిటిక్ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఇప్పుడు ఈ మాస్టర్‌కు కూడా ఆస్కార్ ఓటర్‌గా పిలుపు రావడం మంచి విషయమని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతా ఎన్నో ఇంటర్నేషన్ స్టేజీలపై తెలుగు సినిమాకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఆస్కార్ వేడుకల్లో భాగం కావడం అనేది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు కూడా గర్వకారణం అంటున్నారు ఫ్యాన్స్.



Also Read: అందుకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశా, ఇన్‌స్టాగ్రామ్ వదలకపోవడానికి కారణం ఇదే: రేణు దేశాయ్