కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'(Chandramukhi 2). అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. హారర్ జానర్ లో వచ్చిన 'చంద్రముఖి' అప్పట్లో సౌత్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ దానికి సీక్వెల్ గా వచ్చిన 'చంద్రముఖి 2' మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదని ఆడియన్స్ నుంచి టాక్ వినిపించింది.
ఈ విషయం కాస్త పక్కన పెడితే... విడుదలకు ముందే ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా సినిమాలో హీరోగా నటించిన రాఘవ లారెన్స్ రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారట. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు రాఘవ లారెన్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. లారెన్స్ దాదాపు రూ. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఓ సినిమాకు లారెన్స్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం బహుశా ఇదే మొదటిసారి. అందుకే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లారెన్స్ నటించిన గత చిత్రాలకి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోలేదు. కానీ 'చంద్రముఖి 2' కోసం రూ. 25 కోట్లు తీసుకోవడం గమనార్హం. సినిమా హిట్ అయినా కాకపోయినా 'చంద్రముఖి 2'తో లారెన్స్ కి మాత్రం మంచి లాభమే వచ్చిందని ఈ విషయం తెలిసిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక 'చంద్రముఖి 2' విషయానికి వస్తే... వడివేలు, రావు రమేష్, లక్ష్మీ మీనన్, మహిమ నంబిహార్, రాధిక శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో లారెన్స్, కంగనా నటన పరంగా ఆకట్టుకున్నా స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేకపోవడం, ఊహలకు తగ్గట్లుగా సాగే కథనం మైనస్ గా మారాయి.
దాదాపు రూ.45 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.12కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని పర్వాలేదు అనిపించుకుంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది చూడాలి.
Also Read : మనసుకు హత్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైలర్ విడుదల