Rag Mayur: తెలుగులో మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్... పెద్ద సినిమాల్లో ఛాన్స్ వస్తే స్టార్ మెటీరియల్
సివరపల్లి, గాంధీ తాత చెట్టు... రెండు వేర్వేరు ప్రాజెక్టుల! హీరో, విలన్... రెండు డిఫరెంట్ రోల్స్! నటుడిగా రెండిటిలో మెప్పించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు రాగ్ మయూర్.
నటుడిగా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ రోల్స్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అవకాశాలు కొంత మందికి మాత్రమే వస్తాయి. అందులో కొందరు మాత్రమే తమ మార్క్ చూపిస్తారు. అటువంటి నటుడు రాగ్ మయూర్ (Rag Mayur). క్యారెక్టర్ మాత్రమే కాదు, అందులో తన నటన కూడా హైలైట్ అయ్యేలా నటించడం అతని స్టైల్. ఇటీవల ఒకే రోజు సిల్వర్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేశారు. ఒక దాంట్లో హీరో అయితే... మరొక దాంట్లో విలన్ టైపు రోల్ చేశారు. అతని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
'సినిమా బండి'తో కెరీర్ షురూ!
రాగ్ మయూర్ బ్రిలియంట్ స్టూడెంట్. స్టేట్ టాపర్ కూడా! చదువు పూర్తి చేశాక సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట రివ్యూస్ రాశారు. ఇప్పుడు అతని గురించి రివ్యూలలో రాస్తున్నారు. 'సినిమా బండి'తో రాగ్ మయూర్ హీరోగా మారారు. ఆ సినిమాకు, అందులో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ 'కీడా కోలా', నరేష్ 'వీరాంజనేయులు విహార యాత్ర'లో నటించారు. ఇటీవల ఒకే రోజు రెండు ప్రాజెక్టులతో ఆయన ఆడియన్స్ ముందుకు వచ్చారు.
అందులో హీరో... ఇందులో విలన్!
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'. అందులో రాగ్ మయూర్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. ఒక విధంగా విలన్ అని చెప్పవచ్చు. పల్లెటూరిలో రైతుల పొలాలు తీసుకుని ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నించే వ్యాపారవేత్త ఏజెంట్ సతీష్ పాత్రలో రాగ్ మయూర్ చక్కటి నటన కనబరిచారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు.
'గాంధీ తాత చెట్టు' థియేటర్లలో విడుదలైన రోజు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'సివరపల్లి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. అందులో హీరోగా నటించారు రాగ్ మయూర్. హిందీలో హిట్ అయిన 'పంచాయత్' రీమేక్ అయినా సరే... 'సివరపల్లి'ని తెలుగు నేటివిటీకి దగ్గరగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించారు. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే? ఒక పల్లెటూరికి వెళితే? అక్కడ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఇష్టం లేని ఉద్యోగంలో ఎలా చేశాడు? వంటి విషయాలను చక్కగా తన నటనతో కన్వే చేశారు రాగ్ మయూర్.
'సివరపల్లి' వెబ్ సిరీస్, 'గాంధీ తాత చెట్టు' సినిమాతో రాగ్ మయూర్ మంచి పేరు తెచ్చుకున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు, పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తే స్టార్ మెటీరియల్ అయ్యే టాలెంట్ రాగ్ మయూర్ (Rag Mayur Upcoming Projects)లో ఉంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2లో ఒక సినిమా, ఇంకా అనుపమా పరమేశ్వరన్ 'పరదా', 'గరివిడి లక్ష్మి' సినిమాల్లో కూడా నటిస్తున్నారు రాగ్ మయూర్.
Also Read: స్టార్ డైరెక్టర్, హీరో అడిగారు... రిజెక్ట్ చేయడంతో అవకాశాలు రానివ్వలేదు - బాంబు పేల్చిన అనసూయ