రచనా బెనర్జీ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన రచనా.. ఆ తర్వాత బెంగాలీలోని బుల్లితెరకు పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఎంపీగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. దీంతో చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. తను హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.


ఆ దర్శకుడి వల్లే..


తెలుగులో ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించానని గుర్తుచేసుకున్నారు రచనా బెనర్జీ. ఆ జ్ఞాపకాలన్నీ తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఇక్కడ నటీనటులు అందరూ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారని, వారి నుండే తాను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంటుందని, కథలు చాలా బాగుంటాయని అన్నారు. తను ఇలా ఉన్నందుకు తెలుగు ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఇక తెలుగులో తనకు అవాకశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంటూ.. తమిళంలో సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనను చూసి ‘నేను ప్రేమిస్తున్నాను’ చిత్రంతో తనను లాంచ్ చేశారని తెలిపారు. చాలామంది స్టార్లతో నటించానని, బెంగాలీ అయినా కూడా తనకు మంచి రోల్స్ ఆఫర్ చేసి ఆదరించారని అన్నారు. పైగా తనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని గుర్తుచేసుకున్నారు.


అలా అయితేనే కమ్ బ్యాక్..


చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఎంత పెద్ద స్టార్లు అయినా కూడా చాలా సింపుల్‌గా ఉంటారని, అది వారి గొప్పదనం అని ప్రశంసించారు రచనా. చిరంజీవితో పనిచేయడం చాలా బాగుంది, బాలకృష్ణ అయితే ఊరికే కోప్పడేవారని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సెట్‌లో ఏదైనా సరిగా లేకపోతే బాలయ్యకు వెంటనే కోపం వచ్చేదని అన్నారు. ఇక తెలుగు సినిమాల్లో తనకు చాలా ఆఫర్లు వచ్చాయని.. కానీ, మంచి ప్రాజెక్ట్ అయితేనే కమ్ బ్యాక్ ఇస్తానని లేకపోతే తనకు అస్సలు ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చేశారు రచన. రెండేళ్ల క్రితం కూడా తనకు ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందని.. కానీ దర్శకుడు, నిర్మాత అప్రోచ్ తనకు నచ్చలేదని, స్క్రిప్ట్ కూడా బాలేదని బయటపెట్టారు. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో తనకు రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే చాలా అభిమానమని తెలిపారు. తను హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు వారు హీరోలుగా ఉండుంటే బాగుండేదని తన కోరికను బయటపెట్టారు.


ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..


సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవడంపై రచనా స్పందించారు. అన్నింటికి ఒక టైమ్ వస్తుందని, అలాగే అప్పుడు పెళ్లికి టైమ్ వచ్చిందనుకొని చేసుకున్నానని, అందులో పెద్ద విషయం ఏమీ లేదని సింపుల్‌గా సమాధానమిచ్చారు రచనా. పెళ్లి అయినా ఇప్పటికీ వర్క్ చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తను 21, 22 వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఇక అప్పటికీ, ఇప్పటికీ సినీ పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్ అంటే డ్యాన్స్, కొన్ని సీన్స్‌కే పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు కథలు అనేవి మారుతున్నాయని, పాత్రలకు ప్రాధాన్యత లభిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలను ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథలను కూడా ఆదరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’లను మసాలా మూవీస్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.


Also Read: అరెరే విశ్వక్, అప్పుడు అలా అంటివి - ఇప్పుడు సపోర్ట్ కావాలా? గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారే!