Rakul Preet Singh Marriage: స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియుడు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. వీరి వివాహం గోవాలో ఈరోజు (ఫిబ్రవరి 21) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరగనుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే ఐటీసీ గ్రాండ్ సౌత్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి హీరోయిన్ రాశీ ఖన్నా వెళ్లడం లేదట. 


టాలీవుడ్ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్ - రాశీ ఖన్నాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రకుల్‌ తన వివాహానికి ఆహ్వానించిన అతికొద్ది మంది సన్నిహితులలో రాశీ కూడా ఉందట. అయితే రాశీ తన స్నేహితురాలి పెళ్ళికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే రాశీ ప్రస్తుతం తన కజిన్ వివాహ వేడుకలలో బిజీగా ఉంది. అందుకే పెళ్లి తర్వాత చివర్లో నిర్వహించే రకుల్‌ ప్రీత్‌ సింగ్ - జాకీ భగ్నానీల రిసెప్షన్‌కు రాశీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 


గ్రాండ్ గా రకుల్ - జాకీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ - జాకీల వివాహ వేడుకను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా లాంటి ప్రముఖ డిజైనర్లు వీరి పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. మెహందీ, హల్దీ వేడుకల దగ్గర నుంచి, నిన్న ఫిబ్రవరి 20 రాత్రి సంగీత్ వరకూ ప్రతీది సందడిగా జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


Also Read: 'చిరంజీవి సినిమా అయినా బాగాలేకపోతే మ్యాట్నీ షో కూడా ఎవరూ చూడరు'


భగ్నానీ & సింగ్ కుటుంబ సభ్యులు రకుల్‌ - జాకీ పెళ్లికి స్వాగతం పలకడం, లవ్‌ బర్డ్స్‌ పేర్ల తొలి అక్షరాలు RJ ఉన్న కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న సినీ ప్రముఖుల ఫోటోలను నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ రాజ్‌ కుంద్రా - శిల్పా శెట్టి, వరుణ్ ధావన్ - భార్య నటాషా దలాల్ లు రకుల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. నటుడు ఆయుష్మాన్ ఖురానా, అతడి భార్య తహిరా కష్యప్ కూడా గోవాకు చేరుకున్నారు. సంగీత్‌లో 'కూలీ నంబర్ 1'లోని 'హుస్న్ హై సుహానా' పాటకి వరుణ్ డ్యాన్స్ చేయగా.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు.


రకుల్ ప్రీత్ - జాకీల భగ్నానీల వివాహం రెండు కుటుంబాల సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరుగుతోందని తెలుస్తోంది. ఈరోజు 'చుడా'తో ఈ పెళ్లి వేడుక ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. తొలుత వీరి వివాహాన్ని మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్ చేయాలనుకున్నారు. కానీ గత డిసెంబరులో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 


2009లో ‘గిల్లీ’ అనే కన్నడ చిత్రంలో తెరంగేట్రం చేసిన రకుల్‌ ప్రీత్ సింగ్.. 'కెరటం' అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ మూవీతో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ, కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ సినిమాల్లోనూ రాణించింది. ఇక జాకీ భగ్నానీతో ప్రేమలో పది డేటింగ్ చేసింది. 2021 అక్టోబర్‌ లో రకుల్ పుట్టిన రోజున తమ ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అధికారంగా వెల్లడించింది. ఇద్దరూ ఈరోజు మూడు మూళ్ళ బంధంతో దంపతులుగా మారబోతున్నారు.


Also Read: అందరికీ బాలయ్యే కావాలి - అంత డిమాండ్ ఏంది సామి?