PVR ఐనాక్స్. మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ తీరు దారుణంగా తయారైంది. వరుసగా నష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 50 స్క్రీన్లు క్లోజ్ చేయాలని భావిస్తోంది. థియేటర్ల నిర్వహణ ఖర్చు పెరగడం, ఆదాయం తగ్గడంతో PVR ఐనాక్స్ నష్టాల్లో కూరుకుపోయింది. గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా మిగలడంతో ప్రేక్షకులు రాక మల్టీప్లెక్స్ లు వెలవెలబోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు ఏకంగా రూ.333 కోట్లు నష్టం వాటిల్లిందని PVR ఐనాక్స్ సంస్థ వెల్లడించింది. జనవరిలో కంపెనీ రూ. 105.49 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే స్కీన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ప్రక్రియ ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది.
నష్టాలను తగ్గించుకునేందుకు PVR ఐనాక్స్ కీలక నిర్ణయం
వాస్తవానికి మల్టీప్లెక్స్ లలోని స్క్రీన్లను మాత్రమే మూసివేసి వేయనున్నట్లు సంస్థ తెలిపింది. మాల్స్ ను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపింది. గత ఏడాది క్రితం ఐనాక్స్ లీజర్ తో PVR జోడీ కట్టింది. దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ సంస్థగా రూపొందింది. ఇండియాతో పాటు శ్రీలంకలో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లను రన్ చేస్తోంది. ఈ రెండు దేశాల్లో ఈ సంస్థకు సుమారు 1,689 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 168 స్క్రీన్లను ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్క్రీన్లను ఓపెన్ చేయాలి అనుకుంటుంది. 9 స్క్రీన్లు ఇప్పటికే ప్రారంభం కాగా, మరో 15 స్క్రీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో 152 స్క్రీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, వరుస నష్టాల కారణంగా లాభాలు సాధించని 50 స్క్రీన్లను మూసేయాలని పీవీఆర్ నిర్ణయించింది.
ఓటీటీల విస్తృతితో మల్టీప్లెక్స్ లకు తీవ్ర నష్టం!
భారత్ లోని సినిమా ఆపరేటర్లు కరోనా మహమ్మారి విజృంభణ తర్వాతి నుంచి చాలా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సినిమా ప్రేమికులు OTTలను బాగా ఉపయోగించారు. నెమ్మదిగా ఓటీటీలు బాగా విస్తృతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సినిమా థియేటర్లకు రావడం తగ్గించారు. అంతేకాకుండా, తినుబండారాలు, టికెట్ల వ్యయం భారీగా పెరగడంతో ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ద్వారా సినిమాలు చూడటం మంచిదని సినిమా అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు నష్టాల బాటపడుతున్నాయి. రోజు రోజుకు లాభాలు తగ్గి నష్టాలు పెరుగుతున్నాయి. చేసేదేవీ లేక లాభాలు సాధించని థియేటర్లు, మల్టీప్లెక్స్ లు మూసివేతకు రెడీ అవుతున్నాయి. PVR ఐనాక్స్ కూడా వచ్చే 6 నెలల కాలంలో సుమారు 5 స్క్రీన్లను క్లోజ్ చేసే యోచనలో ఉన్నది. అప్పటిలోగా మళ్లీ లాభాలు వస్తే నిర్ణయంపై పునరాలోచించే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
Read Also: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!