'పుష్ప ది రూల్' విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోయే సినిమాల పట్ల జాతీయ స్థాయిలో ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు బన్నీ పట్ల అభిమానం చూపిస్తున్నారు. దాంతో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే కథల కోసం చూడాల్సిన బాధ్యత హీరో మీద పడింది. దాంతో 'దేవర'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న కొరటాల శివ (Koratala Siva)తో సినిమా చేయడానికి చర్చలు సాగిస్తున్నారట.
అప్పట్లో ఆగిన సినిమా పట్టాలు ఎక్కుతుందా?
అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ కొత్తగా తెర మీదకు వచ్చినది ఏమీ కాదు. కొన్నేళ్ల క్రితం వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే... అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పక్కకు వెళ్ళింది.
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రైజ్', 'పుష్ప ది రూల్' సినిమాలు చేశారు అల్లు అర్జున్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో 'దేవర' చేశారు కొరటాల శివ. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్న కథతో ఎన్టీఆర్ హీరోగా 'దేవర' చేశారని ప్రచారం కూడా జరిగింది. అయితే బన్నీకి చెప్పిన కథ వేరు, దేవర సినిమా కథ వేరు అని కొరటాల క్లారిటీ ఇచ్చారు.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు, ఆ తదనంతర పరిణామాల తర్వాత అల్లు వారి ఇంటికి వెళ్లిన సినీ ప్రముఖులలో కొరటాల శివ కూడా ఉన్నారు. దాంతో ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులకు కూడా ఒక స్పష్టత వచ్చింది. ఇటీవల మరోసారి బన్నీని కొరటాల కలిశారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఒక కథ పట్ల చర్చలు జరిగాయట. అప్పట్లో ఆగిన సినిమా మళ్లీ పట్టాలు ఎక్కుతుందా?లేదంటే కొత్త కథతో అల్లు అర్జున్ కొరటాల కలిసి సినిమా చేస్తారా? అనేది చూడాలి.
త్రివిక్రమ్ సినిమాతో బన్నీ... దేవర 2తో కొరటాల!
Allu Arjun Next Movie After Pushpa 2: అల్లు అర్జున్, కొరటాల శివ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ... ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిసింది. 'పుష్ప' తర్వాత మాటల మాంత్రికుడు - గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ సమాయత్తం అవుతున్నారు. మరొక వైపు 'దేవర' సీక్వెల్ 'దేవర 2' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఇద్దరు తమ తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత... కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. వీళ్లిద్దరూ కలిసి చేయబోయేది పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదూ
Also Read: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?