Pushpa 2 North India Theatrical Rights: ప్రస్తుతం తెలుగు హీరోలకు బాలీవుడ్‌లో మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ గురించి తన తెలుగు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ థియేట్రికల్ రైట్స్ కోసం బాలీవుడ్‌లో జరుగుతున్న పోటీ చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. అంత పోటీ తర్వాత తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిన రేట్లు చూస్తుంటే ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రోజురోజుకీ ‘పుష్ప 2’ స్కేల్ భారీగా పెరిగిపోతుందని అనుకుంటున్నారు.


వందల కోట్ల బిజినెస్..


‘పుష్ప 2’ కోసం జరిగిన పోటీలో అనిల్ తడాని.. థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. దీనికోసం ఆయన రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. సౌత్ ఇండియాలో ఈ రేంజ్‌లో పోటీ జరగడం, 200 కోట్ల విలువతో రైట్స్ అమ్ముడుపోవడం ప్రేక్షకులకు ఇంతగా ఆశ్చర్యాన్ని కలిగించేది కాదేమో. కానీ ఇదంతా జరిగింది నార్త్ ఇండియాలో థియేట్రికల్ రైట్స్ కోసం. అందుకే తెలుగు ప్రేక్షకులు సైతం ఈ వార్త విని షాకవుతున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తుండడంతో ఈ రేంజ్‌లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని అనుకుంటున్నారు. దీంతో ‘పుష్ప 2’ క్రియేట్ చేసిన రికార్డులలో ఇది కూడా యాడ్ అయ్యింది.


‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ బ్రేక్..


సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ను మేకర్స్.. చాలా భారీ ఎత్తులో తెరకెక్కిస్తున్నారు. ఏ విషయంలో కూడా వారు కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ‘పుష్ప 2’ అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ కలిపి రూ.1000 కోట్లను డిమాండ్ చేసినట్టు సినీ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’.. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ కలిపి రూ.900 కోట్ల బిజినెస్ చేసింది. దానికంటే ఎక్కువ దక్కించుకోవాలనే ఆశతో ‘పుష్ప 2’ రూ.1000 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక వారు అనుకున్నట్టుగానే కేవలం నార్త్ ఇండియాలోనే రూ.200 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం మేకర్స్‌కు సంతోషాన్ని కలిగిస్తోంది.


టీజర్ అదుర్స్..


తాజాగా ‘పుష్ప 2’ నుండి విడుదలయిన టీజర్ కూడా ప్రేక్షకులకు చాలా నచ్చేసింది. అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్.. విలన్స్‌తో ఫైట్ చేసే సీన్ నుండి ఈ టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటివరకు ‘పుష్ప 2’ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్‌లో ఈ ఫైట్ సీక్వెన్స్ గురించే హైలెట్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సీన్, ఒక్క గెటప్‌తో ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. చీరకట్టుతో, ఒంటి నిండా బంగారంతో అల్లు అర్జున్ ఫైట్ చేయడం చూస్తుంటే ఓ రేంజ్‌లో కిక్ వస్తుందని ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘పుష్ప 2’ రిలీజ్ చాలా ఆలస్యం అవ్వడంతో ఆగస్ట్ 15న ఎలాగైనా దీనిని థియేటర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్.



Also Read: రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్