ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'పుష్ప 2'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తోంది. తాజాగా "పుష్ప 2" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వేదిక, డేట్ కన్ఫామ్ కాగా, పోలీసుల నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా రీసెంట్ గా కేరళలో ఈవెంట్ తో అదరగొట్టిన "పుష్ప 2" టీం నవంబర్ 29న, శుక్రవారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 30న చిత్తూరులో ఈ మేరకు ఈవెంట్ నిర్వహించబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే... ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఏపీలో ఏమో గానీ తెలంగాణలో... హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిన్నటి దాకా తర్జన భర్జనలు జరిగాయి. పర్మిషన్ దొరికే ఛాన్స్ లేదని, దాదాపుగా ఈవెంట్ లేనట్టేనని టాక్ కూడా నడిచింది. మొదట యూసఫ్ గూడలో ఈవెంట్ ను నిర్వహించాలని అనుకున్నప్పటికీ, అనుమతులు రాలేదని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 1న "పుష్ప 2" గ్రాండ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజ్ వేదికగా జరగబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పోలీసుల నుంచి అనుమతి లభించగా, సుకుమార్ వేడుకలో పాలు పంచుకోబోతున్నాడని సమాచారం. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక "పుష్ప 2" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ పాల్గొనబోతుండడం మరో విశేషం. ఎందుకంటే కేరళ ఈవెంట్లో సుకుమార్ కనిపించకపోవడంతో, అల్లు అర్జున్ - సుకుమార్ కి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఆయన ఈవెంట్ ని స్కిప్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ హైదరాబాద్ లో జరిగే ఈవెంట్లో సుకుమార్ పాల్గొనబోతుండడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఈవెంట్ ఎక్కడ జరిగినా సరే భారీ సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. ఇక హైదరాబాద్ ఈవెంట్ కు ఆ సంఖ్య డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
"పుష్ప" లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "పుష్ప 2". ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, జగపతిబాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, తమన్, సామ్ సీఎస్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ బిజీఎం అందిస్తున్నారు.
Also Read: 'పుష్ప 2' ఫీవర్‌లో మరో క్రికెటర్... పుష్ప గాడి రూల్ స్కై లెవల్ - వైరల్ వీడియో చూశారా?