ప్రస్తుతం ఎక్కడ చూసినా "పుష్ప 2" ఫీవర్ కన్పిస్తోంది. ఈ పాన్ వరల్డ్ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక స్టార్ క్రికెటర్ "పుష్ప" స్టైల్ కు, స్వాగ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ క్రికెటర్ కూడా పుష్ప రాజ్ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఆయన మరెవరో కాదు సూర్య కుమార్ యాదవ్. తాజాగా ఆయన ఓ పెళ్ళిలో 'పుష్ప 2' సినిమాలోని 'సూసేకి' అనే పాటకు హూక్ స్టెప్స్ వేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన క్రికెట్ గురించి కాకుండా సినిమా వార్తల్లో నిలిచి, అందరి దృష్టిని ఆకర్షించారు. సూర్యకుమార్ యాదవ్ సోదరి దినాల్ యాదవ్ కృష్ణ మోహన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా వారి సోదరి సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సూర్య, దేవిషా ఇద్దరూ బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. 'పుష్ప 2' చిత్రంలోని 'అంగారోకా అంబర్సా కల్తా హై మేరా సామే' (సూసేకి) పాటపై డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సూర్య అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సూర్య కుమార్ యాదవ్ మాత్రమే కాదు... ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా 'పుష్ప'రాజ్ కు వీరాభిమాని. ఆయన క్రికెట్ ఆడుతున్నప్పుడు మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా 'పుష్ప' సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ, పుష్ప రాజ్ మ్యానరిజంను ఫాలో అవుతారు. అంతేకాదు ఏకంగా పుష్పరాజ్ కాస్ట్యూమ్ లో డేవిడ్ ఓ యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రమోషన్లలో 'పుష్ప 2 : ది రూల్' టీం బిజీ బిజీగా ఉంది. ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలోకి రాబోతోంది.
సూర్య కుమార్ యాదవ్ విషయానికొస్తే... ఆయన 1990 సెప్టెంబర్ 14న ముంబైలో జన్మించారు. సూర్య కుమార్ కుటుంబానికి క్రికెట్ నేపథ్యం ఏమాత్రం లేదు. కానీ సూర్యకు మాత్రం క్రీడలంటే ప్రత్యేకంగా మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్ లో బెస్ట్ అన్పించుకున్న సూర్య కుమార్ యాదవ్‌కు 31 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అంతకు ముందు ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. సూప్ లా షాట్ కారణంగా సూర్య కుమార్ యాదవ్‌ను మిస్టర్ 360 అని కూడా పిలుస్తారు. సూర్యకుమార్ యాదవ్ వన్డే క్రికెట్‌లో 37 మ్యాచ్‌లు ఆడి, 773 పరుగులు చేశాడు. 78 టీ20 మ్యాచ్‌లు ఆడి, 2570 పరుగులు చేశాడు. సూర్య పేరు మీద 4 సెంచరీలున్నాయి. సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడి, 2 సెంచరీలతో సహా 3594 పరుగులు చేశాడు. ఇక ఈ యంగ్ క్రికెటర్ కు కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.