Yatra 2 Teaser : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి అద్భుతంగా నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల కావడం జగన్ కి, వైసీపీ పార్టీకి ఇది కాస్త బాగా ఉపయోగపడిందనే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. జనాల్లో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా 'యాత్ర2' రాబోతున్న విషయం తెలిసిందే.


ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించబోతున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వైయస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు. ఈ సీక్వెల్ని కూడా 2024 ఏపీ ఎలక్షన్స్ కి ముందు విడుదల చేయబోతున్నారు. ఏపీ ఎలక్షన్స్ కి కొద్ది రోజుల టైం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలోనే ఈరోజు 'యాత్ర 2' టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఎంతో ఎమోషనల్ గా సాగింది.


ఇక టీజర్ లో జీవా జగన్ పాత్రలో జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ బాడీలాంగ్వేజ్ ని అచ్చుగుద్దినట్టు దింపేసాడు. టీజర్ విషయానికొస్తే.. ఒక వీధిలో కళ్ళు లేని వ్యక్తి వైఎస్ఆర్ ఫోటో పట్టుకుని ఉంటే అటువైపుగా వెళ్తున్న జగన్ తన కాన్వాయ్ ఆపి ఆ కళ్ళు లేని వ్యక్తితో మాట్లాడడంతో టీజర్ మొదలవుతుంది. ‘‘తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు’’ అంటూ చంద్రబాబు పాత్రధారి డైలాగ్ చెప్తాడు. ‘‘కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఇంకో 100 మంది వైఎస్సార్ లని సృష్టించగలదు. ఈ విషయం అతడికి చెప్పండి. దారిలోకి రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించండి’’ అంటూ సోనియా గాంధీ పాత్ర చెబుతున్న డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.


ఆ తర్వాత జగన్ జైలుకు వెళ్లడం లాంటి సన్నివేశాలను చాలా ఎమోషనల్ గా చూపించారు. దాంతోపాటు లక్ష కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డాడనేది ఒక అబద్ధం మాత్రమే అని డైరెక్టర్ రాఘవ ఈ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఇక టీజర్ చివర్లో ‘‘చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు అన్నా. ఒకవేళ గుర్తు పెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా ఉంటే చాలు’’ అంటూ జీవా చెప్పే డైలాగ్ మరింత ఎమోషనల్ గా ఉన్నాయి.


ఇక కొసమెరుపుగా టీజర్ లో వైయస్సార్ గా మమ్ముట్టిని చూపించారు. ఆయన చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ అయింది. ‘‘నా రాజకీయ ప్రత్యర్థులైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడి లాగా వాళ్ల నాశనం కోరుకోనయ్య’’ అంటూ వైయస్సార్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని కలిగించింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు మేకర్స్.


Also Read : యశ్ సినిమాలో కరీనా కపూర్ - ఇన్నాళ్లకు సౌత్ డెబ్యూకు సిద్ధమయిన బాలీవుడ్ భామ