Producer Naga Vamsi Anger About Movie Critics: కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని.. అందుకే 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) హిట్ టాక్ సొంతం చేసుకుందని నిర్మాత నాగవంశీ (Nagavamsi) అన్నారు. ఈ మూవీ టికెట్ ధరలను మంగళవారం నుంచి నార్మల్ రేట్స్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సినిమా రివ్యూలు రాసే వారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2 కాదు
ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఎందుకు ప్రోత్సహించరని నాగవంశీ ప్రశ్నించారు. 'కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలా ఉన్నా చూడడానికి అవేమీ బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2 కాదు కదా. మ్యాడ్ స్క్వేర్‌లో నటించిన వారు పెద్ద హీరోలు కూడా కాదు. కోర్ట్ మూవీ కంటెంట్ బాగుందని ఆడియన్స్ సినిమా చూశారు. పక్క సినిమా బాగోలేదని కాదు. అలాగే మ్యాడ్ స్క్వేర్ కూడా బాగుందనే చూస్తున్నారు. అంతే కానీ వేరే సినిమాలు బాగోలేవని కాదు.' అని తెలిపారు.
జనాలకు తెలిసింది కూడా వారికి తెలియదా?
'ఈ సినిమా థియేటర్‌లో చాలాసార్లు చూశాను. మూవీలో స్వాతిరెడ్డి పాటపైనా కామెంట్స్ చేశారు. కంటెంట్ లేదు. సెకండాఫ్ బాగోలేదు అని రివ్యూలు రాశారు. ఆడియన్స్‌కు నచ్చింది. వారి నుంచి రెస్పాన్స్ బాగుంది. ఆ మాత్రం కూడా రివ్యూయర్స్‌కు తెలియదా?. ప్రేక్షకులు సినిమా ప్రేమించి చూస్తున్నప్పుడు మీకేంటి బాధ. హిట్ టాక్ వచ్చినా దానికి కూడా ఏవేవో కారణాలు రాస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు ఎందుకు చెప్పడం లేదు. మీరు రాసింది నిజం అని అనిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు.' అంటూ నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు.
'నా సినిమాల వల్లే మీ సైట్స్ రన్'
సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టినా ఏమీ మాట్లాడలేదని.. కానీ, రాసిన రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని నాగవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మీడియా, మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్స్ పని చేస్తున్నాయి. మేము యాడ్స్ ఇస్తేనే అవి రన్ అవుతాయి. సినిమా మంచిగా ఆడుతున్నా.. 'కంటెంట్ లేని సినిమా ఎందుకు ఆడుతుందో తెలియదు.' అంటూ పోస్టులు పెట్టొద్దు. సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. ఇది గుర్తు పెట్టుకోండి.' అని తెలిపారు.
'నా సినిమాల రివ్యూలు రాయొద్దు'
రివ్యూలు రాసే వారికి అంతగా తమపై పగ ఉంటే తన సినిమా రివ్యూలు రాయొద్దని నాగవంశీ అన్నారు. 'ఇప్పుడు నేను ఇన్ని కామెంట్స్ చేశాను. నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా ఆర్టికల్స్ రాయొద్దు. నా దగ్గర యాడ్స్ తీసుకోవద్దు. నా సినిమా రివ్యూలు రాయొద్దు. నేను ఓపెన్‌గా చెప్తున్నా. మూవీ ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ వెబ్ సైట్స్ ద్వారా ప్రమోట్ చేస్తేనే నా సినిమాలు ఆడట్లేదు.' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.