Kalyan Dasari: ప్రముఖ నిర్మాత, 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా నిర్మించిన నిర్మాత డి.వి.వి. దానయ్య. ఆయన తన కుమారుడు కల్యాణ్ దాసరిని పాన్ ఇండియా సినిమాతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు.

కల్యాణ్ దాసరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'అధీరా' (Adhira Movie). ఈ చిత్రానికి 'ఆ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఆయనకూ ఇది తొలి పాన్ ఇండియా సినిమా. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

కల్యాణ్ దాసరిని కథానాయకుడిగా పరిచయం చేయడం కోసం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు డీవీవీ దానయ్య. ప్రశాంత్ వర్మ కంటే ముందు కొంత మంది పేర్లు వినిపించాయి. పలు కథలు విన్నారు. అయితే... సూపర్ హీరో క్యారెక్టరైజేషన్, సైన్స్ ఫిక్షన్ కథతో ప్రశాంత్ వర్మ మెప్పించారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా నచ్చడంతో దానయ్య ఓకే చెప్పారట.