కంటెంట్ బేస్డ్ కథలతో సినిమాలు ప్రొడ్యూస్ చేసే టాలీవుడ్ నిర్మాతల్లో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఒకరు. ఆ సంస్థలో సినిమా సినిమాకూ మధ్య మినిమమ్ రెండేళ్ల విరామం ఉంటోంది. తక్కువ సినిమాలు అయినా విజయాల శాతం ఎక్కువ. నాని 'జెంటిల్ మన్', సుధీర్ బాబు 'సమ్మోహనం', సమంత 'యశోద'తో నిర్మాతగా హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడు కొత్తగా మరో సినిమా స్టార్ట్ చేశారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 15 పూజతో ప్రారంభించారు. 


దర్శకుడు ఇంద్రగంటితో హ్యాట్రిక్ సినిమా
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti), నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్... సూపర్ హిట్ కాంబినేషన్. 'జెంటిల్ మన్', 'సమ్మోహనం' సినిమాల తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. వాళ్లిద్దరూ ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమాలో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) కథానాయకుడు. ఆయన సరసన రూప కొడువాయూర్ హీరోయిన్. సోమవారం (మార్చి 25వ తేదీ) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా  కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా... ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


Also Readపృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?






జంధ్యాల ఇప్పుడు సినిమా చేస్తే... 
సినిమా ప్రారంభమైన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... "మా శ్రీదేవి మూవీస్ సంస్థకు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆత్మీయుడు. నాకు అత్యంత సన్నిహితుడు. 'జెంటిల్ మన్', 'సమ్మోహనం' తర్వాత మళ్ళీ అతనితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'బలగం' సినిమాతో ప్రియదర్శి హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఆయనకు యాప్ట్ సబ్జెక్ట్. ఇందులో తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ హీరోయిన్. ఇదొక క్యూట్ ఫిల్మ్. స్వీట్ ఎంటర్‌టైనర్. ఇందులో చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. జంధ్యాల గారు ఇప్పుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. సోమవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు పెట్టాం" అని తెలిపారు.


Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్



ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించనున్న ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష (హర్ష చెముడు), శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కాస్ట్యూమ్స్: మనోజ్, కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ - శ్రీదేవి, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, పోరాటలు: వెంకట్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, ఛాయాగ్రహణం: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్స్: విద్య శివలెంక - లిపిక ఆళ్ల, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.