Prithviraj Praising RGV :  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు దొరకకుండా పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు ఆయన పరారీలో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు 'సలార్' స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. 


ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ? అనే చర్చ జోరుగా నడుస్తోంది టాలీవుడ్లో. కొన్నాళ్ళ కిందట సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 25న ఒంగోలు పోలీసుల ఎదుట ఆర్జీవి విచారణ కోసం హాజరు కావలసి ఉంది. కానీ ఆయన విచారణకు హాజరు కావడం లేదని తెలుసుకున్న పోలీసులు ముందుగానే ఆయన నివాసానికి వెళ్లి, అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్మ అక్కడ లేకపోవడంతో పోలీసులకు చుక్కెదురైంది. మరి వర్మ ఎక్కడికి వెళ్ళాడు ? అంటే ఆయన టీంతో పాటు పోలీసుల దగ్గర కూడా సమాధానం లేదు. ఇలా ఆర్జీవి కోసం ఓవైపు పోలీసులు గాలిస్తుంటే, మరోవైపు ఆయన కోయంబత్తూర్ లో "లూసిఫర్ 2" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తను 'లూసీఫర్ 2' సినిమా టీంతో ఉన్నట్టుగా ఈనెల 23న ఆర్జీవి ఎక్స్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 


దీంతో పోలీసులు వర్మ కోసం ఒంగోలు నుంచి చెన్నైకి స్పెషల్ టీం ను పంపించి, అరెస్టుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్జీవినీ ఆకాశానికి ఎత్తేస్తూ "సలార్" స్టార్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది "లూసిఫర్ 2" మూవీ. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.


ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ "లూసిఫర్ 2" సెట్స్ ని రీసెంట్ గా సందర్శించారు. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ "యాక్టర్ ని డైరెక్టర్ ని డైరెక్ట్ గా చూస్తున్నాను.. మా జాబ్ ని మీరే తీసేసుకుంటే మేమేం చేయాలి?" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు వర్మ. దానికి పృథ్వీరాజ్ సుకుమారన్ "మీరు భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషిని ఎవ్వరూ తీసుకోలేరు. మీరు లూసిఫర్ 2 సెట్స్ పైకి రావడం గొప్ప అదృష్టం" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 






పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా వర్మ గురించి ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. "ఆధునిక భారతీయ సినిమాను చూస్తూ పెరిగిన చిత్ర నిర్మాతలలాగే నేను కూడా ఈ లెజెండ్ నుంచి ప్రేరణ పొందాను. సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన ఆర్జీవి ఒక కంప్లీట్ మాస్టర్ పీస్. మీరు లూసిఫర్ 2 సెట్స్ పై ఉండడం, మీతో సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడడం ఒక అదృష్టం సార్" అంటూ రాస్కొచ్చారు. దీంతో వర్మ గురించి ఇంతటి వివాదం నడుస్తుంటే, మరోవైపు పృథ్వీరాజ్ ఆయనపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.


ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ మోహన్ లాల్ తో కలిసి 'కంపెనీ' అనే సినిమా చేశారు. ఈ మూవీతోనే మోహన్ లాల్ 2022 ఏప్రిల్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆర్జీవి 'లూసిఫర్' సెట్స్ లో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ ని కలవడం విశేషం. ఇక తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో వర్మ వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో తన అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. ఈరోజు ఆ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతోంది.



Read Also :‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే