'ప్రేమమ్' సినిమాతో క్లాసిక్ హిట్ అందుకుని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని తెలిపారు. తాను సినిమాలకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఉన్నట్టుండి ‘ప్రేమమ్’ డైరెక్టర్ అల్ఫోన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ? పలువురు నెటిజన్స్ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన అల్ఫోన్స్ ఆ పోస్ట్ ను కొంత సమయం తర్వాత డిలీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


వివరాల్లోకి వెళ్తే.. మలయాళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో 'ప్రేమమ్' మూవీ ముందు వరుసలో ఉంటుంది. నివీన్ పౌలి, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ యూత్ కు ఎంతగానో కనెక్ట్ అయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ ఫీల్ గుడ్ మూవీ గా అద్భుతంగా తెరకెక్కించారు  ప్రతి ఒక్కరూ అల్ఫోన్స్ వర్క్ కి ఫిదా అయిపోయారు. ఇక ఇదే సినిమాని మన తెలుగులో నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ తో చందు మొండేటి రీమేక్ చేయగా ఇక్కడ కూడా 'ప్రేమమ్' సూపర్ హిట్ అందుకుంది.


ఇదిలా ఉంటే ప్రేమన్ డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తిగా బక్క చికిపోయి నెరిసిన గడ్డంతో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం గురించి మళ్ళీ ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆయన సోషల్ మీడియాలో స్వయంగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు.


" నేను నా సినిమా థియేటర్ కెరీర్ ను ఆపేస్తున్నాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ వరకు మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ చేస్తాను. నిజానికి సినిమాలను ఆపేయాలని అనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేదు. నేను చేయలేని పని గురించి ప్రామిస్ లు చేయలేను. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా ఎదురవుతుంది" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.


ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత ఈ పోస్టును డైరెక్టర్ అల్ఫోన్స్ వెంటనే డిలీట్ చేశారు. కానీ అప్పటికే అందరూ దాన్ని చూసేసారు. అల్ఫోన్స్ ముందు పోస్ట్ పెట్టి ఆ తర్వాత ఎందుకు తీసేసారో ఎవరికి అర్థం కాలేదు. పోస్ట్ డిలీట్ చేయడం వెనుక రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది. కాగా 'నేరమ్' అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు అల్ఫోన్స్. ఆ తర్వాత చేసిన 'ప్రేమమ్' చిత్రం దర్శకుడిగా ఆయనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.


Also Read : ‘బిగ్ బాస్’ బ్యూటీ హీరోయిన్‌గా ‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా - క్లాప్ కొట్టిన నాగచైతన్య



Join Us on Telegram: https://t.me/abpdesamofficial