రికొత్త కథతో వచ్చిన ‘లవ్ టుడే’ను కుర్రాళ్లు అంత ఈజీగా మరిచిపోలేరు. లవర్స్ తమ మొబైల్ ఫోన్లు మార్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో.. నేటితరం ఆలోచనలకు తగినట్లుగా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రేమికులకు భలే నచ్చేసింది. అందుకే, ఆ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ సంపాదించింది. ఈ నేపథ్యంలో ‘లవ్ టుడే’ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్‌కు ఊహించని ఆఫర్ వచ్చింది. ఏకంగా లోకనాయుకుడి నిర్మాణ సంస్థలో ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది.   


తమిళంలో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ‘లవ్ టుడే’ సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. ఈ మూవీతో ప్రదీప్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా సక్సెస్ ను దక్కించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ యువ దర్శకుడితో కలిసి వర్క్‌ చేసేందుకు ఎంతో మంది స్టార్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. అలాగే పలువురు నిర్మాతలు ప్రదీప్‌కు బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక నాయకుడు కమల్‌ హాసన్ నుంచి ప్రదీప్ రంగనాథన్‌కు ఊహించని అవకాశం దక్కింది. రాజ్ కమల్ ఫిలింస్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌ నుంచి ప్రదీప్ రంగనాథన్‌కు భారీ ఆఫర్ వచ్చింది. దీనికి ప్రదీప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కోసం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో...


కమల్‌ హాసన్ నిర్మాణంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించనున్న ఈ సినిమాకు విఘ్నేష్‌ శివన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రదీప్ రంగనాథన్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా విభిన్నమైన కథాంశంతో విఘ్నేష్ శివన్ కథను రెడీ చేశారట. నయనతార భర్త విఘ్నేష్ శివన్‌కు ఈ మధ్య సరైన హిట్ లేదు. కమర్షియల్‌ సక్సెస్‌ లను సొంతం చేసుకోవడంలో విఫలమవుతున్నారు.   


ఒక వైపు కమల్‌ హాసన్ వరుస చిత్రాల్లో నటిస్తూ... మరోవైపు నిర్మాతగా కూడా ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 'విక్రమ్‌' సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో కమల్‌ హాసన్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గతంలో కమిట్ అయ్యి మధ్యలో నిలిచిపోయిన సినిమాలను కూడా ఆయన పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


ఇక 'లవ్‌ టుడే' తర్వాత ప్రదీప్‌ రంగనాథన్ సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇప్పటికే 'పొన్నియన్ సెల్వన్‌' సినిమా హీరో జయం రవితో ఒక సినిమాను చేసేందుకు చర్చలు పూర్తి అయ్యాయి. అతి త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమధ్య తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఆ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు చిత్రాలకు కూడా ప్రదీప్ రంగనాథన్‌ ఓకే చెప్పాడు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాదిలో కూడా ఈ యువ హీరో కమ్‌ దర్శకుడు బిజీ బిజీగా సినిమాలు చేయబోతున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు ఇతర హీరోలను డైరెక్ట్ చేయబోతున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా ఈయన చేసిన, తీసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది.