ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.. హీరోగానూ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని, డైరెక్టర్ గానూ సత్తా చాటారు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న ఆయన, ప్రస్తుతం డైరెక్ష‌న్‌ - కొరియోగ్ర‌ఫీ కంటే నటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'వూల్ఫ్' (Wolf) అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. 


'వుల్ఫ్' అనేది సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న సినిమా అని టీజర్ ని బట్టి అర్థమవుతుంది. మూవీ సెటప్ అంతా చూస్తుంటే మంత్రాలు, క్రుద్ర పూజలు, తాంత్రిక, అతీంద్రియ శక్తుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభుదేవాతో పాటుగా రాయ్‌ ల‌క్ష్మి, అన‌సూయ భ‌ర‌ద్వాజ్, అంజు కురియన్, శ్రీ గోపిక, వశిష్ఠ సింహా తదితరులు ఇతర కీల‌క పాత్ర‌లల్లో కనిపిస్తున్నారు. పెద్దగా డైలాగ్స్ లేకుండా, కథేంటి అనేది తెలియకుండా కట్ చేసిన ఈ టీజర్.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.



ఇందులో ప్రభుదేవా ముఖానికి మాస్క్ తగిలించి, అతన్ని గొలుసులతో ఒక చోట బంధించి ఉంచారు. అతనిపై ఏవో క్రుద్ర పూజ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా అక్కడ నుంచి బయటపడటానికి ప్రయత్నించే క్రమంలో వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అనసూయ ఒక మంత్రగత్తెని పోలిన పాత్రలో పరవశంతో ఊగిపోతూ కనిపించింది. ఇందులో ఆమెది పవర్ ఫుల్ రోల్ అని అర్థమవుతోంది. ఆ పాత్రకు సంబంధించి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. 


Also Read: పిల్లోడు దొరకలేదని మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా? - పెళ్లి వార్తలపై హీరోయిన్ ఫైర్


'వూల్ఫ్' లో రాయ్ లక్ష్మి, అనసూయలు ఇంతముందెన్నడూ చూడని లుక్ లో కొత్తగా కనిపించారు. ఒక సన్నివేశంలో మోడరన్ డ్రెస్సుల్లో ఉన్న రాయ్‌ ల‌క్ష్మి, అంజు కురియన్, అన‌సూయలు ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్నట్లు చూపించడంతో.. అసలు కథేంటి అనే ఆసక్తిని పెంచారు. సెటప్ అంతా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగానే డిఫెరెంట్ గా ఉంది. విజువల్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే ఉంది. కాకపోతే 'చల్లని గాలి.. కిటికీ తెరవాలి.. కల్లు తాగి బజ్జున్నావా' అంటూ వచ్చే పాట మాత్రం ఫంక్తు డబ్బింగ్ సినిమాని గుర్తు చేస్తుంది. 


'వూల్ఫ్' అనేది ప్ర‌భుదేవా హీరోగా న‌టిస్తోన్న 60వ సినిమా. విను వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని, సందేశ్ నాగరాజ్మరియు బృందా జయరాం కలిసి నిర్మిస్తున్నారు. అరుళ్ విన్సెన్ట్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, అమ్రిష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని త్వరలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ బుధవారం రిలీజ్ చేసిన పోస్టర్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. 


'వుల్ఫ' టైటిల్ పై ట్రోలింగ్..
'Wolf' సినిమా తెలుగు వెర్షన్ ను 'వుల్ఫ' అనే టైటిల్ కార్డుతో ప్రమోట్ చేసారు. సాధారణంగా తెలుగులో వోల్ఫ్ అనో, వూల్ఫ్ అనో లేదా ఊల్ఫ్ అనో రాయాలి. కానీ విచిత్రంగా 'వుల్ఫ' అని పోస్టర్ వదిలారు. తెలుగులో ఆ పదాన్ని ఒక తిట్టుగా వాడుతారు. తెలిసి పెట్టారో లేదా ట్రాన్స్‌లేష‌న్ ను పట్టించుకోలేదో తెలియదు కానీ.. ఇది ట్రోలింగ్ కు గురైంది. ఇంకా నయం 'ప్రభుదేవా as వుల్ఫ' అని పెట్టలేదు అని నెటిజన్లు సెటైర్లు వేశారు. ఇది మేకర్స్ వరకూ చేరడంతో, తప్పు సరిద్దుకున్నారు. ఇప్పుడు 'వూల్ఫ్' టైటిల్ తో టీజర్ రిలీజ్ చేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial