Prabhas Helps Fish Venkat Kidney Surgery: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్లు వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. 

గత కొంతకాలంగా కమెడియన్, యాక్టర్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొద్ది రోజులుగా పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకటే చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండగా... ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని ఎవరైనా దాతలు సాయం చేయాలని ఆయన కుమార్తె స్రవంతి వేడుకున్నారు.

ప్రభాస్ ఆర్థిక సాయం

ఫిష్ వెంకట్ దీన స్థితిపై స్పందించిన ప్రభాస్ ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినట్లు వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. 'కిడ్నీ డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం.' అని ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసినట్లు చెప్పారు. దీంతో మా ప్రభాస్‌ది మంచి మనసు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: రిచ్చెస్ట్ వరల్డ్‌లోకి మీకు వెళ్లాలని ఉందా? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'కలియుగం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

కుమార్తె స్రవంతి కన్నీళ్లు

కమెడియన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కిడ్నీలు మార్పిడి చేయాల్సి ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పాడైపోయాయని ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు. దాదాపు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మరింత విషమంగా మారిందని... కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని... దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరారు స్రవంతి. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తుండడం పట్ల ఆందోళనతో ఉన్నట్లు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మా దీన స్థితిని చూసి ప్రభాస్ గొప్ప మనసుతో సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. ఆయన టీం నుంచి కాల్ వచ్చిందని... ఆపరేషన్‌కు డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

కిడ్నీ డోనర్ కోసం ఎదురుచూపులు

ప్రస్తుతం కిడ్నీ డోనర్ కోసం ఎదురుచూస్తున్నట్లు స్రవంతి తెలిపారు. 'నా తండ్రి రక్తం గ్రూపుతో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నాం. నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరస్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం.' అని చెప్పారు.

ఫిష్ వెంకట్ విలన్, హాస్య పాత్రలతో ఆడియన్స్‌ను మెప్పించారు. గబ్బర్ సింగ్, బన్నీ, దిల్, నాయక్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, అదుర్స్, ఢీ, మిరపకాయ్ వంటి హిట్ మూవీస్‌లో నటించారు. ఇటీవల ఆహాలో రిలీజ్ అయిన 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీలో నటించారు. అలాగే,  'మా వింత గాధ వినుమా' మూవీలోనూ కనిపించారు.