యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  


70 శాతం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ పూర్తి


‘ప్రాజెక్ట్ K’ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగులోకి అడుగు పెడుతోంది. కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ కి సర్వం సిద్ధం అయ్యింది. మూవీ షూటింగ్‌ కోసం దీపిక ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ‘ప్రాజెక్ట్ K’ చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి కానున్నాయి. 


రెండు భాగాలుగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’


టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్ K’ కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ తొలి భాగం కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి ప్రయాణించేందుకు ప్రభాస్‌ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 


విడుదల సంక్రాంతికా? సమ్మర్ లోనా?   


‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని తొలుత మేకర్స్ ప్రకటించారు. కానీ, ప్రస్తుతం సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ తో రూపొందించబడిన చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ చిత్రానికి డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  ‘ప్రాజెక్ట్ K’ కంటే ముందు ప్రభాస్ ‘సలార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.   ప్రభాస్ ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నాడు.అటు  మారుతీ డైరెక్షన్ లోనూ ‘రాజా డీలక్స్’ అనే సినిమా సైతం చేస్తున్నాడు.     






Read Also: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?