మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ కథానాయకుడిగా 'ప్రాజెక్ట్ K' అని వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'కల్కి 2898 AD' అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ గ్లిమ్స్ లో విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు గాని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఇప్పటికే గ్లిమ్స్ ని చూసిన చాలామంది ఈ సినిమా ఖచ్చితంగా ఇండియా వైడ్ గా హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు.


ఇక ఈ సినిమా కోసం హిందూ మైథాలజీని మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. హిందూ మైథాలజీకి సైన్స్ తో పాటు కొంత ఫిక్షన్ ని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. హిందూ మైతాలజీ ప్రకారం.. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో మళ్లీ వస్తారని ఉంది. ఇదే లైన్ తో నాగ అశ్విన్ 'కల్కి 2898AD' సినిమాని రూపొందిస్తున్నారు. కల్కి అవతారంలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. సినిమాలో ఈ కల్కి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కామిక్ కాన్ ఈవెంట్లో మాట్లాడిన ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఈ మేరకు ప్రభాస్ మాట్లాడుతూ.." ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ని నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని, అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ కే టీం లో నాగ్ అశ్విన్ చాలా సరదా మనిషని, ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ని డిజైన్ చేశారని, కానీ సినిమాలో నా పాత్ర  కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమేడియన్" అంటూ నవ్వుతూ చెప్పారు. దీంతో ప్రాజెక్ట్ కే గురించి ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ కామెంట్స్ విన్న నెటిజెన్స్ అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు కల్కి పాత్ర కామెడీగా ఉండడమేంటి? ప్రపంచం మొత్తాన్ని కాపాడే యోధుడి పాత్ర కామెడీగా ఉంటే ఎలా? అలా అయితే ఈ సినిమా కూడా పోయినట్లేనా? అంటూ కామెంట్స్ చేశారు.


అయితే ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' లో తన పాత్ర నిజంగానే కామెడీగా ఉంటుందని చెప్పాడా? లేక అలా సరదాగా అన్నాడా? అనేది తెలియకపోయినా ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్, కోలీవుడ్ సీనియర్ నటుడు కమలహాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.