రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు
'RC16' ప్రాజెక్టులో నటించే నటీనటుల విషయంలో రోజుకో పేరు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కోసం పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తిని సంప్రదించారట. సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకం కావడంతో ఆ పాత్రకి నారాయణమూర్తి అయితేనే సరిగ్గా సూట్ అవుతారని బుచ్చిబాబు ఇటీవలే ఆయన్ని వెళ్లి కలిశారట. కానీ ఆర్.నారాయణమూర్తి బుచ్చిబాబు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్ చేసింది లేదు. గతంలో పూరి జగన్నాథ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' సినిమా కోసం ఆర్. నారాయణమూర్తిని అనుకున్నారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఆయన్ని కలిసి తన పాత్రకు సంబంధించి నెరేషన్ కూడా ఇచ్చారు. కానీ అప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో చివరికి ఆ పాత్ర పోసాని కృష్ణ మురళి దగ్గరికి వెళ్ళింది. 'టెంపర్' లో పోసాని పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. అప్పుడు ఎన్టీఆర్ సినిమాని ఎలా రిజెక్ట్ చేశాడో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాని కూడా నారాయణమూర్తి అలాగే రిజెక్ట్ చేయడం గమనార్హం.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్
'దేవర' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతున్న జాన్వీ కపూర్ రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతుంది. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి కథానాయిక జాన్వీ కపూర్ ని మూవీ టీమ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, సమంతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదట.
ఇటీవలే బుచ్చిబాబు జాన్వి కపూర్ కి స్టోరీ నెరేట్ చేయగా, 'RC16' లో భాగం అయ్యేందుకు జాన్వి కూడా అంగీకరించినట్లు తాజా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో యశ్? క్లారిటీ ఇచ్చిన టీమ్