Poonam Pandey: కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన స్టంట్ దేశాన్ని షేక్ చేసింది. తాను మరణించిందంటూ స్వయంగా ప్రకటించుకొని.. రెండు రోజుల తర్వాత అదంతా సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసమే అంటూ బయటికొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో ప్రేక్షకులంతా తనపై మండిపడ్డారు. అవగాహన ఇచ్చే పద్ధతి ఇది కాదంటూ ఫైర్ అయ్యారు. కేవలం ఫైర్ అవ్వడం మాత్రమే కాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చారు కూడా. ప్రస్తుతం పూనమ్‌తో పాటు తన భర్త సామ్ బాంబే కూడా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కోర్టులో హాజరు..


కాన్పూర్ పోలీస్ కమిషనర్ దగ్గర పూనమ్ పాండేపై, తన భర్త సామ్ బాంబేపై మొదటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. వీరిద్దరిపై ఫైజన్ అన్సారీ అనే వ్యక్తి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తన భర్త సామ్‌తో కలిసి పూనమ్ మరణించినట్టుగా ఘోరమైన అబద్ధాలు చెప్పిందని,  ఈ క్రమంలో క్యాన్సర్‌కు ఉన్న సీరియస్‌నెస్‌ను వారు హేళన చేశారని, అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఎంతోమంది ప్రేక్షకుల, అభిమానుల నమ్మకాన్ని వారు ఒమ్ము చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు ఫైజన్ అన్సారీ. కేవలం పర్సనల్‌గా ప్రమోషన్ కోసమే వారు ఈ పనిచేశారని, దీని వల్ల ప్రజలు ఎంతగానో ఆందోళన చెందారని ఎఫ్ఐఆర్‌లో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వారిని అరెస్ట్ చేయాలని, త్వరలోనే ఈ కేసు విషయంలో కాన్పూర్ కోర్టులో హాజరయ్యేలా చేయాలని అన్సారీ కోరారు.


తనతో పాటు భర్త కూడా..


పూనమ్ పాండే తన మరణం గురించి అబద్ధం చెప్పినందుకు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆమెను తిట్టినా.. తన భర్త సామ్ మాత్రం సపోర్ట్‌గా మాట్లాడాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండడం లేదు. కొన్నేళ్ల క్రితమే వీరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. అయినా ఇలాంటి సమయంలో పూనమ్‌కు సపోర్ట్ చేయడానికి సామ్ ముందుకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే పూనమ్‌తో పాటు సామ్ కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూనమ్‌పై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పుడు ఫైజన్ అన్సారీ కూడా చేరారు. కానీ ఆయన ఏకంగా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


కొందరి అభినందనలు..


క్యాన్సర్‌పై అవగాహన క్రియేట్ చేయడం కోసం మరీ ఇలా చేయాలా అంటూ పూనమ్ పాండేను, తన ఏజెన్సీను విమర్శిస్తుండగా.. దీనిపై తన ఏజెన్సీ స్పందించడానికి ముందుకొచ్చింది. ‘మేము చేసిందంతా కేవలం సర్వైకల్ క్యాన్సర్‌కు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మాత్రమే. పూనమ్ పాండే, హాటర్‌ఫ్లై కలిసి సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నప్పుడు మేము కూడా అందులో భాగమయ్యాం. ముందుగా క్యాన్సర్‌తో బాధపడినవారు, క్యాన్సర్‌ వల్ల ఇష్టమైనవారిని కోల్పోయినవారు దీని వల్ల బాధపడితే వారికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నాం’ అంటూ ఏజెన్సీ ప్రకటించింది. చాలామంది పూనమ్ పాండే చేసిన పనిపై మండిపడుతున్నా.. కొందరు మాత్రం దీని వల్ల సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో చాలామందికి తెలిసేలా చేశారని అభినందిస్తున్నారు.


Also Read: ఆ ప్రభుత్వం ఎందుకలా చేసిందో ఎవరూ అడగరు - భూకేటాయింపుపై ‘యాత్ర 2’ దర్శకుడు మహి వీ రాఘవ