తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు, హోరు మొదలైంది. ముఖ్యంగా ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల్లో అగ్ర హీరోలు పోటీ చేస్తున్నారు. వారితో పాటు ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారంలో కొందరు సినిమా స్టార్లు పాల్గొంటున్నారు. పిఠాపురం నియోజవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తున్నారు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నగరి నియోజకవర్గంలో సీనియర్ హీరోయిన్, నటి రోజా సెల్వమణి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో సినిమా తారల సందడి లేదు. ఓ నటి వేసిన నామినేషన్ మాత్రం ఆసక్తి కలిగించేలా ఉంది.
చేవెళ్ల నుంచి ఎంపీ బరిలో సాహితీ దాసరి
Sahithi Dasari In Chevella Lok Sabha Constituency Candidates: 'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' సినిమాలు చూశారా? అందులో 'గెటప్' శ్రీను వైఫ్ రోల్ చేసిన నటి గుర్తు ఉన్నారా? ఆమె పేరు సాహితీ దాసరి. తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికలకు పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాలో ఆమె ఉన్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఎన్నికల అధికారిని కలిసిన సాహితీ దాసరి... స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు సుమారు ఐదు లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లు అని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడివిట్‌లో పేర్కొన్నారు.
'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2'తో పాటు నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన 'సర్కారు నౌకరి', ఇంకా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాల్లో సాహితీ దాసరి నటించారు. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొన్నారు.
చేవెళ్ల నుంచి రామ్ చరణ్ మామ పోటీ!
చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మామ కూడా ఉన్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చరణ్ సతీమణి ఉపాసనకు ఆయన పెదనాన్న వరుస. అంటే... అపోలో హాస్పటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి రెడ్డికి అల్లుడు. దేశంలో అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో విశ్వేశ్వర్ రెడ్డి సైతం ఉన్నారు. కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ స్థానానికి జి రంజిత్ రెడ్డి, భారతీయ రాష్ట్ర సమితి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నామినేషన్ వేశారు. వాళ్లతో పోటీలో సాహితీ దాసరికి ఎన్ని ఓట్లు వస్తాయి? అసలు వాళ్ల మందు ఆమె నిలబడతారా? అనేది చూడాలి.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!