Case Registered Against Tamil Actress Saranya Ponvannan: శరణ్య పొన్వన్నన్ ఎన్నో సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు వేశారు. 'రఘువరన్ బీటెక్' సినిమాలో ధనుష్ తల్లిగా ఆమె వేసిన పాత్ర ఎంతోమందికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆమె వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై పక్కింటి వాళ్లు కేసు పెట్టారు. తనను చంపేందుకు ప్రయత్నించింది అంటూ ఆరోపిస్తూ ఆమెపై కేసు పెట్టారు.
వివాదం ఏంటంటే?
ప్రముఖ నటుడు పొన్వన్నన్ భార్య శరణ్య పొన్వన్నన్. ఆమె ఫ్యామిలీతో కలిసి చెన్నైలోని విరుగంబాక్కంలో నివసిస్తున్నారు. అయితే, ఆమె గత కొద్ది రోజులుగా పక్కింటి శ్రీదేవి అనే మహిళతో గొడవ పడుతున్నారట. పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా.. ఇటీవల దానికి సంబంధించి పెద్ద గొడవ అయ్యింది. అయితే, ఆ టైంలో శరణ్య తనపై హత్యా యత్నం చేశారంటూ ఆరోపిస్తూ శ్రీదేవి కేసు పెట్టారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లు కూడా పోలీస్ స్టేషన్ లో సమర్పించారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి ఇంటి గేటు దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుందట. నిన్న సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య పొన్వన్నన్ కారు ఆమె డోర్ బయట పార్క్ చేసి ఉంది. శ్రీదేవి ఇంటిని తాకేలా శరణ్య కారు ఉందని, ఈ కారణంగానే శరణ్య పొన్వన్నన్ కి శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైందని కొన్ని తమిళ వెబ్ సైట్లు వార్తను పేర్కొన్నాయి. ఇక ఇటీవల వచ్చిన పార్కింగ్ అనే సినిమా గురించి అందరికీ తెలిసిందే. కారు పార్కింగ్ విషయంలో గొడవపడ్డ రెండు కుటుంబాలు చంపుకునే వరకు వెళ్తాయి. అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
1987లో కమల్ హాసన్ నాయగన్ చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు శరణ్య. ఆ తర్వాత ఎన్నోచిత్రాల్లోనటించారు. ఎక్కువగా తల్లి పాత్రలు వేసిన ఆమె ఎంతోమందిని అలరించారు. తల్లంటే ఇలానే ఉండాలి అనే క్యారెక్టర్లు చేశారు. శరణ్య తెలుగులో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో కూడా నటించారు. ‘నీరజనం’, ‘సాహసం’, చంటిగాడు, రాఖి, జగడం, రెడీ, వేదం, కొమరం పులి, మనం, బ్రహ్మోత్సవం, గ్యాంగ్ లీడర్, మహా సముద్రం, కుషీ సినిమాల్లో నటించారు.