ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... కాస్త సమయాన్ని సినిమాలకు కేటాయిస్తూ చేతిలో ఉన్నవి ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఒకవైపు సుజీత్ దర్శకత్వంలోని 'దే కాల్ హిమ్ ఓజీ' (They Call Him OG) చిత్రీకరణ చేస్తున్న ఆయన... షూట్ ఫినిష్ అయ్యాక 'హరిహర వీరమల్లు' డబ్బింగ్ చెప్పారు.
నాలుగు గంటల్లో వీరమల్లు డబ్బింగ్ పూర్తి
మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). జూన్ 12వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు పాటలకు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు పవన్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబైలో ఉన్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' షూటింగ్ చేస్తున్నారు. అందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డారు. అయినా షూటింగ్ ఆగలేదు. ఇమ్రాన్ హష్మీ అవసరం లేని సన్నివేశాలను, పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించాల్సిన సీన్లను సుజీత్ చకచకా పూర్తి చేస్తున్నారు.
బుధవారం ఉదయం అంతా 'ఓజీ' షూటింగ్ చేసిన పవన్ కళ్యాణ్ రాత్రి 10 గంటల తర్వాత 'హరి హర వీరమల్లు' డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారని, కేవలం నాలుగు గంటల్లో తన పాత్రకు సంబంధించిన డైలాగులు అన్ని చెప్పేశారని చిత్ర బృందం పేర్కొంది.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. ఆయనది ఔరంగజేబు పాత్ర. ఇతర పాత్రల్లో సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు నటించారు. నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి చిత్రాన్ని పూర్తి చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం మీద రూపొందిన ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Also Read: పవన్ 'ఓజీ'లో చంద్రబాబు ఇంటికి కాబోయే కోడలు... మెగా మేనల్లుడు ఆట పట్టించడం వెనుక అసలు కహానీ