Pawan Kalyan About HHVM In Pre Release Event: తాను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదని... సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనతోనే ఉన్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ ఫుల్ స్పీచ్‌తో ఆయన అదరగొట్టారు. ఆయన ప్రసంగం కొనసాగుతున్నంత సేపూ ఫ్యాన్స్ కేకలతో హూరెత్తించారు.

నా వెనుక ఉన్నది ఫ్యాన్స్

తాను పడుతూ ఉన్నా... మళ్లీ  లేచినా తన వెన్నంటి నడిపింది ఫ్యాన్సేనని పవన్ అన్నారు. 'నేను పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా... అన్నా నీ వెంట మేమున్నాం అంటూ ఫ్యాన్స్ నాకు ధైర్యం ఇచ్చారు. నా దగ్గర ఏమైనా వెపన్స్ ఉంటాయా? నా దగ్గర ఏమైనా గూండాలు ఉంటారా? నా దగ్గర ఎవ్వరూ లేరు. గుండెల్లో ఉండే మీరు తప్ప. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా అదే గుండె ధైర్యం, అదే తెగింపు నాలో ఉన్నాయి. నేను డబ్బుకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. బంధాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చాను. నాకు ఎప్పుడూ ఫ్యాన్స్ అండగా ఉన్నారు.' అని అన్నారు.

Also Read: మహేష్ బాబు న్యూ లుక్ అదుర్స్ - బెస్ట్ ఫోటో మూమెంట్ విత్ సూపర్ స్టార్

బ్రహ్మానందం స్పీచ్... పడిపడి నవ్విన పవన్

అంతకు ముందు బ్రహ్మానందం పవన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. పవన్ మానవత్వం పరిమళించిన మనిషి అని... సమాజానికి ఉపయోగపడేలా ఇంకేదో చేయాలని ఎప్పటికీ తపన పడుతూనే ఉంటారని ప్రశంసించారు. 'పవన్ ఎన్ని సమస్యలు ఎదురైనా తాను వేసుకున్న బాటలోనే నడిచారు. ఆయన బాటలోనే పది మందిని నడిపించుకుంటూ వచ్చారు. తనను తాను చెక్కుకున్న శిల్పి. 

నటుడు కావాలని అనుకోకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావాలని కోరుకోకపోయినా అది కూడా విధి ప్రకారమే జరిగింది. లేచిన కెరటం కాదు పడి లేచిన కెరటం గొప్పది. ఎవరు ఏం అనుకున్నా సంద్రం వచ్చి మీద పడ్డా ఎలాంటి భయం లేకుండా ఉండగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్.' అని అన్నారు. 'మీ ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది.' అని బ్రహ్మానందం అనడంతో పవన్ కల్యాణ్ పడిపడి మరీ నవ్వారు.

21వ శతాబ్దపు 'శివాజీ'

ప్రతీ శతాబ్దంలో ఛత్రపతి శివాజీలాంటి యోధుడు పుడతారని... 21వ శతాబ్దపు శివాజీ పవన్ కల్యాణ్ అని డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నారు. 'ఈ టైటిల్ పెట్టింది క్రిష్. ఆయనకు ధన్యవాదాలు. అఖండ భారతావనికి మొఘల్ చక్రవర్తి అయినా కూడా ఔరంగజేబుకు ఛత్రపతి శివాజీ ఉన్నంత కాలం నిద్ర పట్టలేదు. ఈ కథ 1684లో మొదలవుతుంది. మొఘలుల నుంచి జ్యోతిర్లింగాలు, కాశీ క్షేత్రంతో పాటు ధర్మ స్థాపన కోసం ఓ యోధుడు చేసిన పోరాటమే ఈ మూవీ.

ఇందులో ఓ ఫైట్ చూస్తే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం స్పష్టంగా కనిపిస్తుంది. మా తండ్రి మంచి పేరు సంపాదించి నాకు ఇచ్చారు. ఆయన వల్లే పవన్ కల్యాణ్ గారి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి నా గురించి సినిమా తీసిన విధానం గురించి పవన్ గారు రెండు గంటల పాటు మాట్లాడారని చెప్పారు. అంతకన్నా గొప్ప అభినందన ఇంకేం ఉంటుంది.' అని తెలిపారు. పవన్ కల్యాణ్‌తో హిస్టారికల్, పాన్ ఇండియా మూవీని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉందని నిర్మాత ఎఎం రత్నం అన్నారు.