జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో ( PK Tweet ) ఎలాంటి మాటలు లేవు. కానీ ఓ స్కెచ్ మాత్రం ఉంది. అందులో ఓ సందేశం ఉంది. " ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని .. నూరవసారి మాత్రమే యుద్దం చేస్తానని" అందులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాసుకుంటున్న క్యారికేచర్‌కు క్యాప్షన్‌గా ఈ మాటలు పెట్టారు. ఇది ఎవరో తత్వవేత్త చెప్పిన కొటేషన్‌లా ఉందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ మాటలు ఎవరన్నారో రాయలేదు కాబట్టి పవన్ ఆలోచనలేనని అనుకోవచ్చు.





[అయితే పవన్ కల్యాణ్ యుద్ధం ( War )  గురించి ఏ ఉద్దేశంతో మాట్లాడారన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్కడి పరిస్థితులు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఇండియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా అక్కడ చనిపోయారు. ఇది పవన్ కల్యాణ్‌ను బాగా డిస్ట్రబ్ చేసి ఉంటుందని అందుకే యుద్ధం గురించి అలా పెట్టారని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా రష్యా జాతీయురాలు ( Russia Citizen ) .ఈ కారణంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన కలత చెంది ఉంటారని అందుకే ఇలా తన భావాలను వ్యక్తం  చేశారని భావిస్తున్నారు.



అదే సమయంలో పవన్ కల్యాణ్‌ ట్వీట్‌కు లోకల్ అర్థాలను కూడా కొంత మంది అభిమానులు వెదుక్కుంటున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్‌పై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ఆయన సినిమాలకు ఆటంకం కలిగిస్తోంది. భీమ్లా నాయక్ సినిమాను ఏపీలో విడుదల చేయడానికి చిన్నపాటి సమరం చేయాల్సి వచ్చిందని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో చెబుతూ ఉంటారు. టిక్కెట్ రేట్లను పెంచకపోవడం.. నిబంధనల పేరుతో భీమ్లా నాయక్ విడుదల చేస్తున్న ధియేటర్లను కట్టడి చేయడం వంటి కారణాలతో ఇతర చోట్లతో పోలిస్తే ఏపీలో భీమ్లా నాయక్ వసూళ్లు తక్కువగా ఉంటున్నాయి. ధియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నా ఆదాయం మాత్రం గణనీయంగా లేదని అభిమానులు బాధపడుతున్నారు. 



మార్పు కోసం 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ అనడం ప్రభుత్వం విషయంలో తాను ప్రజాస్వామ్య పోరాటాల నుంచి  పక్కకుపోనని చెప్పడమని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇదే పద్దతిలో వెళ్తే చివరికి యుద్ధంలోకి దిగుతానని ఆయన హెచ్చరించినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా పవన్ ఆలోచన యుద్ధం - శాంతి దిశగానే ఉంది.. కానీ అది దేనికి ఉద్దేశించినదన్నదానిపై మాత్రమే క్లారిటీ లేదు.