రామ్ గోపాల్ వర్మ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఏ విషయంపైనైనా.. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ చిన్నతనంలో ఎలా ఉండేవారో ఆయన సోదరి విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. తొలిసారి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారామె. ఈ క్రమంలో వర్మ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చిన్నతనంలో వర్మ తన సోదరి విజయలక్ష్మికి ఓ రేడియో కొనిపెట్టారట. ఒకరోజు అది కిందపడి మిగిలిపోతే.. విజయలక్ష్మి ఏడుస్తూ కూర్చున్నారట. అప్పుడు వర్మ అక్కడకి వచ్చి 'రేడియో మిగిలిపోతే రిపేరు చేయాలి.. ఏడిస్తే అతుక్కోదు' అని అన్నారట. అప్పుడే వర్మ ఆలోచన విధానం చాలా ప్రాక్టికల్ గా ఉండేదని.. విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. వర్మకి సెంటిమెంట్లు ఉండవని అంటుంటారు కానీ.. తన తల్లి, చెల్లెలు ఏడిస్తే అసలు తట్టుకోలేకపోయేవారట. తండ్రి చనిపోయినప్పుడు కూడా వాళ్లు ఎమోషనల్ అవ్వకుండా చూసుకున్నారట.
'ఏడిస్తే బాధ పోదు.. దానికి సొల్యూషన్ వెతకాలనేది వర్మ సిద్ధాంతమని' అతడి చెల్లెలు విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. వర్మకి అమ్మాయిల పిచ్చి అనే కామెంట్స్ పై కూడా ఆమె మాట్లాడారు. 'వర్మ అమ్మాయిలకు కాంప్లిమెంట్స్ ఇస్తాడేగానీ .. వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడని.. ఒకవేళ అలా ప్రవర్తించి ఉంటే.. ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయైనా వర్మకి వ్యతిరేకంగా మాట్లాడేది. అలా జరగలేదంటే.. తను వాళ్లతో ఎంత హుందాగా ఉండేవాడో అర్ధం చేసుకోవచ్చు' అంటూ చెప్పుకొచ్చారు.
వర్మకి శ్రీదేవి, జయసుధ అంటే చాలా ఇష్టమని.. జయసుధ దగ్గరకు వెళ్లి 'మీ తరువాతే శ్రీదేవి' అనేవాడు.. శ్రీదేవి దగ్గరకు వెళ్లి 'మీ తరువాతే ఎవరైనా' అనేవాడని.. వాళ్లకు కూడా ఈ విషయం తెలుసని నవ్వేశారు విజయలక్ష్మి. అలానే చిన్నప్పటి ఓ సంఘటనను షేర్ చేసుకున్నారు.
'మా చిన్నతనంలో తరచూ ఓ అమ్మాయి ఇంటికి వచ్చేది. ఆ అమ్మాయికి మీ కళ్లు చాలా బాగున్నాయండి అని వర్మ చెప్పాడు. మేమంతా షాకయ్యాం. ఆ అమ్మాయితో అప్పటివరకు ఎవరూ అలా మాట్లాడలేదు. పైగా ఆమెది మెల్లకన్ను. దీంతో మా అన్నయ్యని ఎందుకలా అన్నావ్.. తనకు మెల్లకన్ను కదా..? అని ప్రశ్నిస్తే.. 'నేను మాత్రం చూశానేంటి..? తను హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పాను అంటూ బదులిచ్చాడు. ఓసారి బ్యాంక్ లో క్యాషియర్ ను చూసి 'మీ నవ్వు బాగుందండి' అని చెప్పాడు. వర్మకి కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇష్టం' అంటూ చెప్పుకొచ్చారు.