ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ వరుస పెట్టి రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్ కి ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. అగ్ర హీరోల పాత హిట్ సినిమాలను ఇప్పుడు 4k అల్ట్రా HD వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలను చూసి ఫ్యాన్స్ థియేటర్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు 'పోకిరి', పవన్ కళ్యాణ్ 'జల్సా', అల్లు అర్జున్ 'దేశముదురు' రీసెంట్ గా ఎన్టీఆర్ 'సింహాద్రి' వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని కనబరిచాయి.  ఇక ఈ కోవలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ'. ఈ సినిమా అప్పట్లో యూత్ కి తెగ నచ్చేసింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.


ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన  ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా, పవన్ కి చెల్లెలిగా వాసుకి కీలక పాత్ర పోషించింది. వేణుమాధవ్, అలీ, రవిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవా సంగీతం అందించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆ రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ సినిమాని 4k రెజల్యూషన్ తో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తొలిప్రేమ సినిమాను జూన్ 30, 2023న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేకర్స్ రీరిలీజ్ ను ప్లాన్ చేశారు.


ఇక ఈ న్యూస్ తో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు 'తొలిప్రేమ' మూవీ ని 4k క్వాలిటీ లో చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మూడో సినిమా. దీనికంటే ముందు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత', 'సుస్వాగతం' వంటి సినిమాలు చేశాడు పవన్. వీటిలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' యావరేజ్ టాక్ ను రాబట్టినా.. ఆ తర్వాత వచ్చిన 'గోకులంలో సీత', 'సుస్వాగతం' సినిమాలు ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పెంచాయి. ఇక 1998లో 'సుస్వాగతం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ అదే సంవత్సరం 'తొలిప్రేమ' సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకోవడం విశేషం. ఇప్పటికే పవన్ పవన్ కళ్యాణ్ గత సినిమాలు 'తమ్ముడు', 'ఖుషి', 'జల్సా' రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ ని అందుకున్నాయి. మరి ఈ ఇప్పుడు 'తొలిప్రేమ' పవన్ గత సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.


Also Read: పదేళ్లు మాటల్లేవు, ఆ మూవీలోనే ప్రేమ పుట్టింది - తమ లవ్ స్టోరీ చెప్పిన నరేష్, పవిత్ర