మెగా మేనమామ మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 


ఇటీవల Bro-The Avatar నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో న్యూ అప్డేట్ తో వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడితో సహా చిత్ర యూనిట్ పాల్గొన్న కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
మామా అల్లుళ్లు తొలిసారిగా కలసి నటిస్తున్న బ్రో సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా వదిలిన పవన్ - తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్ సైతం మెప్పించింది. 


పవన్ కల్యాణ్ ఈ సినిమాలో మోడరన్ గాడ్ అవతార్ లో కనిపించనున్నారు. కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం అంటూ మోషన్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. గతంలో 'గోపాల గోపాల' సినిమాలో పవన్ దేవుడిగా అలరించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు అదే తరహాలో స్టైలిష్ గాడ్ గా కనిపిస్తారని తెలుస్తొంది.


ఇక మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


'బ్రో' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'కార్తికేయ-2', 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు పవన్ కల్యాణ్ సాయి తేజ్ ల చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది తమ బ్యానర్ లో మరో సక్సెస్ ఫుల్ ఫిలిం అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.


'బ్రో' అనేది తమిళ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్. దీనికి మోస్ట్ వాంటెడ్ మ్యాజిక్ డైరక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 


Read Also: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!