Pawan Kalyan's OG Movie First Ticket Sale Record Price In Choutuppal: ప్రస్తుతం ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' ఫీవర్ నడుస్తోంది. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు 'ఓజీ' ప్రదర్శితం కాబోయే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఇప్పటికే ఆన్ లైన్‌లో టికెట్స్ బుకింగ్స్ షురూ కాగా రిలీజ్ చేసిన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. తాజాగా... తెలంగాణలోని ఓ థియేటర్ వద్ద ఫస్ట్ టికెట్‌ను పవన్ అభిమాని లక్ష రూపాయలకు పైగా వేలంలో కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
టికెట్ కాస్ట్ @ రూ.1,29,999
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాసా థియేటర్‌లో 'OG' బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్‌కు ఫ్యాన్స్ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేం వినోదిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేలంలో పవన్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో సందడిగా పాల్గొన్నారు. పోటీ పడి మరీ టికెట్ దక్కించుకునేందుకు యత్నించారు. చివరకు లక్కారం గ్రామానికి చెందిన అభిమాని ఆముదాల రమేష్ ఏకంగా రూ.1,29,999 పెట్టి టికెట్ సొంతం చేసుకున్నారు. దీంతో ఆ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు అభిమానులు తెలిపారు.
అటు, శనివారం చిత్తూరు నియోజకవర్గంలో 'OG' మూవీ ఫస్ట్ టికెట్‌ను ఓ అభిమాని లక్ష రూపాయలకు సొంతం చేసుకున్నాడు. ఈ డబ్బును గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం సిద్ధమైంది. పవర్ స్టార్ మూవీ టికెట్స్‌ను ఇలా వేలం వేసి ఆ డబ్బులను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడం అభినందనీయం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు పవన్ క్రేజ్ అంటే మామూలుగా ఉండదు అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Also Read: మోహన్ లాల్ @ 'ది కంప్లీట్ యాక్టర్' - మలయాళం To తెలుగు... యాక్టర్ నుంచి సింగర్ వరకు ఈ విషయాలు తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇలా...
తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్, ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆన్ లైన్‌లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏపీలో ఈ నెల 24న అర్ధరాత్రి బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000. ఇక రిలీజ్ నుంచి అక్టోబర్ 4 వరకూ ఫస్ట్ 10 రోజుల పాటు... సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకూ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.100, మల్టీ ఫ్లెక్సుల్లో జీఎస్టీతో కలిపి రూ.150 వరకూ పెంచుకోవచ్చు.