Hari Hara Veeramallu Shooting Began with Epic War Sequence: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతి ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'హరిహర వీరమల్లు' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, కొద్ది రోజులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్. దీంతో ఇప్పట్లో ఇక ఆయన సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదనుకున్నారు. కానీ, హరిహర వీరమల్లు టీం మాత్రం యాక్టివ్ అయ్యింది. వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వదిలింది మూవీ టీం. ఆగస్టు 14 నుంచి 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించినట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరన ప్రారంభించినట్టు మూవీ టీం వెల్లడించింది.
అయితే పవన్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే ఆయన ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో జాయిన్ అవుతారని కూడా పేర్కొన్నారు మేకర్స్. సుమారు 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ మొదలుపెట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో 'హరి హర వీర మల్లు' షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఇందులో పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించనునున్న సంగతి తెలిసిందే.
మునుపెన్నడు చూడని విధంగా ఆయన ఓ యోధుడిలా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇందులో ఆయన భారీ యుద్ద సన్నివేశాల్లో అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇందుకోసం మూవీ టీం ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసిందట. తన కెరీర్ మొదటిసారి పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. త్వరలోనే 'హరిహర వీరమల్లు' పార్ట్ -1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు చిత్రం బృందం సిద్ధమవుతుంది. మొదట డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చింది.
కానీ, కొద్ది రోజులకు ఆయన దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ మూవీ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత విడుదలైన టీజర్ మూవీ మరింత బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహీ, సుబ్బరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు ‘హరిహర వీరమల్లు’ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రామ్, పూరి కాంబో గట్టిగా కొట్టిందిగా!