Pawan Kalyan's Hari Hara Veera Mallu Officially Postponed: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మోస్ట్ అవెయిటెడ్ పీరియాడిక్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూసే ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. మూవీ రిలీజ్ వాయిదా పడుతుందన్న రూమర్లపై నిర్మాతలు తాజాగా స్పందించారు.
మూవీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కాబోతున్నట్లు టీం ప్రకటించగా.. ఆ టైంకు రిలీజ్ అవుతుందా? లేదా? అనే దానిపై జరుగుతోన్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
'ఆ రోజున తీసుకురాలేకపోతున్నాం'
గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 12న మూవీ రిలీజ్ చేసేందుకు అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నామని.. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 'అచంచలమైన ఓపిక, నమ్మకంతో 'హరి హర వీరమల్లు' సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మూవీ రిలీజ్ వాయిదా వేయాలన్న నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మరికొంత టైం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం' అని క్లారిటీ ఇచ్చారు.
Also Read: 'స్పిరిట్' ఒక్కటే కాదు.. ప్రభాస్ 'కల్కి 2' నుంచి కూడా అవుట్? - కొంప ముంచుతున్న దీపికా డిమాండ్స్
'ఆ వార్తలు నమ్మొద్దు'
మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం తమ దృష్టికి వచ్చిందిన.. వాటిని నమ్మొద్దని మూవీ టీం తెలిపింది. 'చాలామంది తమకు తోచింది రాసేస్తున్నారు. అఫీషియల్‌గా ధ్రువీకరించని వార్తలను నమ్మొద్దు. వాటిని వ్యాప్తి చెయ్యొద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎలాంటి ప్రచారాలు నిజమని భావించకండి.
'హరి హర వీరమల్లు' చిత్రం ఓ అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు. ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.' అని తెలిపారు.
కొత్త రిలీజ్ డేట్?
'హరి హర వీరమల్లు' పవర్ ఫుల్ ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుందని టీం తెలిపింది. ఆ ట్రైలర్‌తో పాటే, కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పింది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.