మెగా ఫ్యామిలీ కోసం సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో 'ఓజీ' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. చిరంజీవి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా... సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు, కీలకమైన యూనిట్ సభ్యులు సైతం హాజరు అయ్యారు. షో పూర్తి అయ్యాక చిత్ర బృందానికి థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్... 'ఓజీ యూనివర్స్' కన్ఫర్మ్ చేశారు.
కలెక్షన్స్, ఎంత సక్సెస్ అనేది తెలియదు!'ఓజీ' కలెక్షన్స్ ఎంత? లేదంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది? అనేది తనకు తెలియదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారని, మనస్ఫూర్తిగా చిత్ర బృందం అందరికీ కృతజ్ఞుడినై ఉంటానని ఆయన తెలిపారు. దర్శకుడు తమన్, సంగీత దర్శకుడు సుజీత్‌లను ప్రత్యేకంగా ప్రశంసించారు.
'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు పూర్తి స్థాయిలో తన సమయాన్ని కేటాయించే ఆలోచనలో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తుంటాయి. 'ఓజీ' సినిమాకు ఎండ్ కార్డు పడిన తర్వాత 'దే కాల్ హిమ్ ఓజీ 2' అని సుజీత్ వేసిన టైటిల్ కార్డు చూసి షాక్ అయిన ఆడియన్స్ సైతం ఉన్నారు. మరో సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారా? అని ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చలు నడిచాయి. అటువంటి వార్తలకు చెక్ పెడుతూ 'ఓజీ యూనివర్స్' కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్.
Also Read: 'కాంతార చాప్టర్ 1' సెన్సార్ రిపోర్ట్... రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ సినిమా టాక్ ఎలా ఉందంటే?
''తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. బ్రిలియంట్ వర్క్. సెల్యులాయిడ్ పోయేట్ అనాలి సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ గారిని. సుజీత్ అద్భుతంగా తీశాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బావుంది. ఓజీ యూనివర్స్ కోసం ఎదురు చూస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 'ఓజీ' అని పూర్తిగా సుజీత్ క్రియేషన్ అని పవన్ స్పష్టం చేశారు.
Also Read: ఇడ్లీ కొట్టు సెన్సార్ రిపోర్ట్... నిత్యా మీనన్‌తో ధనుష్ మరో హిట్ కొడతాడా? పల్లెటూరి కథ టాక్ ఏమిటంటే?
ప్రీక్వెల్ ఒక్కటే కాదు... సీక్వెల్ కూడా!'ఓజీ' విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప్రీక్వెల్, సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు దర్శకుడు సుజీత్. రెండూ ప్యారలల్‌గా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 'ఓజీ' ఎండింగ్ గనుక గుర్తు ఉంటే... జపాన్‌లో ఓజాస్ గంభీర ఏం చేశాడు? అక్కడ యాకూజా గ్యాంగ్‌స్టర్‌లను ఎలా అంతం చేశాడు? అనేది చూపించలేదు. 'ఓజీ యూనివర్స్'లో ఆ అంశంతో పాటు జపాన్ వెళ్లిన ఓజాస్ గంభీర తండ్రి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్‌లో పని చేయడాన్ని సైతం చూపించే అవకాశం ఉంది.