Paruchuri Gopala Krishna About Nagarjuna's Naa Saami Ranga Movie: సంక్రాంతి బ‌రిలో నిలిచిన సినిమాల్లో ఒక‌టి అక్కినేని నాగార్జున న‌టించిన ‘నా సామిరంగ’. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం కొంత నెమ్మ‌దించింద‌నే చెప్పొచ్చు. ఇక ఈ మ‌ధ్య సినిమా ఓటీటీలోకి వ‌చ్చింది ఈ సినిమా. నాగార్జున మాస్ లుక్‌లో క‌నిపించారు ఈ సినిమాలో. ఆయ‌నతో పాటు అల్ల‌రి న‌రేశ్, రాజ్ త‌రుణ్ కూడా ఉన్నారు. ‘నా సామిరంగ’ను ఓటీటీలో చూసిన ప్రముఖ మాట‌ల ర‌చయిత ప‌రుచూరి గోపాల కృష్ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. సినిమా బాగుంద‌ని కానీ, కొన్ని విష‌యాలు న‌చ్చ‌లేద‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే? 


‘‘నా సామిరంగ - సినిమా బాగుంది. మంచి ఎంట‌ర్ టైన‌ర్ కానీ, ఎందుకో ఈ సినిమా డ‌బ్బులు రాబ‌ట్ట లేక‌పోయింది. ఏ న‌టుడికైనా, ద‌ర్శ‌కుడికైనా, నిర్మాతకైనా కొన్ని సినిమాలు సంతృప్తిని ఇస్తాయి. ఆ జాబితాలో ఉంటుంది ఈ సినిమా. ఏ సినిమాకైనా ప్ర‌థమార్థం, ద్వితీయార్థం అని రెండూ ఉంటాయి. ఇప్పుడు యువ ద‌ర్శ‌కులు చాలామంది దాస‌రి నారాయ‌ణ గారి టెక్నిక్ ఫాలో అవ్వ‌డం లేదు. ఆయ‌న సినిమాల్లో చివ‌రి అరగంట అద్భుతంగా, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసేలా ఉంటుంది. ముందు నుంచి సినిమా ఎలా ఉన్నా? చివ‌ర్లో మాత్రం ప్రేక్ష‌కులు క‌ళ్లు ఆర్ప‌కుండా చూసేలా చేస్తారు’’ అని అన్నారు.


‘‘ఫ‌స్టాఫ్ బాగుంది.. న‌వ్వించారు, రొమాన్స్ పండించారు. సెకండ్ ఆఫ్ విష‌యంలో కొంచెం జాగ్ర‌త్త ప‌డి ఉంటే బాగుండు అనిపించింది. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీకి దర్శకుడిగా తొలి చిత్రమిది. మలయాళ సినిమా (పొరింజు మరియమ్‌ జోస్‌) కథను తీసుకుని కొన్ని మార్పులతో తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున‌ను కొత్త‌గా చూపించారు. మ‌నంద‌రి మ‌న్మ‌ధుడిని మాస్ లుక్ లో చూపించారు. ఆయ‌న ఆ క్యారెక్ట‌ర్ ని కూడా అద్భుతంగా చేశారు. క‌ళ్ల‌తోనే న‌టించారు. ఒక‌ప్పుడు అక్కినేని నాగేశ్వ‌ర రావు అలా అద్భుతంగా న‌టించేవారు’’ అని తెలిపారు.


‘‘రావు ర‌మేశ్ క్యారెక్ట‌ర్‌ను ముగించేయ‌డం, మ‌ళ్లీ రెండో భాగానికి కొత్త విల‌న్‌ను తీసుకురావ‌డం ఎందుకో నాకు అంత‌గా న‌చ్చ‌లేదు. కూతురిని భ‌య‌పెట్టేందుకు మాత్రమే ఆ క్యారెక్ట‌ర్‌ను అలా డిజైన్ చేశారు అనుకుంటా. ఆ రోల్‌ను అంతం చేయకుండా ఉండుంటే కథనం ఇంకా బిగువుగా ఉండేదని అనిపించింది. విజయ్‌ బిన్నీ ఎంతో ఆలోచించి అలా చేసుండొచ్చు. ఇక అల్ల‌రి న‌రేశ్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న్ను మ‌నం రాజేంద్ర ప్ర‌సాద్ లాగా అనుకుంటాం. ఆయ‌న చేసిన సినిమాలు అలాంటివి. అలాంటిది లుంగీ ఎగ్గొట్టి ప‌దిమందిని తన్న‌డం లాంటివి చూస్తే నాకు మింగుడు ప‌డ‌లేదు. మ‌రి చూసిన ప్రేక్ష‌కుల‌కు ఎలా అనిపించిందో నాకు తెలీదు. అల్లరి నరేశ్‌ పాత్రనూ అంతం చేయడం ఇబ్బందిగా అనిపించింది. పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన ఉండే క్యారెక్టర్లు చనిపోతే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. హీరో.. విలన్లను చంపుతూ వెళ్తే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి. విలన్లు.. హీరో మనుషులను చంపుతూ వెళ్తే దెబ్బతింటాయి. కానీ, ఈ చిత్రం దాన్నుంచి లక్కీగా బయటపడింది. ఆ రెండు పాత్రలను అంతం చేయకుండా ఉండుంటే మరిన్ని వసూళ్లు రాబట్టేదీ సినిమా. నాజర్‌గారు పోషించిన పాత్ర ఆఖరిలో చేసిన పని కూడా నన్ను ఆకట్టుకోలేదు. వీటిలో మార్పులు చేసుంటే బాగుండేది" అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు ప‌రుచూరి గోపాల కృష్ణ‌. ఈ సంద‌ర్బంగా సినిమా యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  


Also Read: ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ ఓటీటీ రిలీజ్ అప్ డేట్, స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?