Parineeti Chopra Real Debut Video: సినీ సెలబ్రిటీల్లో చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు. కొందరు యాక్టింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్క్రీన్ ప్రొడక్షన్‌లో కూడా అవగాహన ఉంటుంది. కొందరు కథలు బాగా రాయగలరు. కొందరు తమ కాస్ట్యూమ్స్‌ను తామే డిజైన్ చేసుకోగలరు. మరికొందరు అయితే ఏకంగా పాటలు కూడా పాడేయగలరు. ఇలా ఓవైపు యాక్టింగ్ చేస్తూ.. మరోవైపు ప్రొఫెషనల్‌గా పాటలు పాడే నటీనటులు చాలా తక్కువమంది ఉంటారు. అందులో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కూడా ఒకరు. తాజాగా పరిణీతి.. మొదటిసారి తను ఆన్ స్క్రీన్‌పై పాడిన వీడియోను పోస్ట్ చేసింది. దాన్నిబట్టి చూస్తే తను చాలా చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకుందని అర్థమవుతోంది.


చిన్న వయసులోనే..


పరిణీతి చోప్రా.. సింగర్ అవ్వాలనుకొని హీరోయిన్ అయ్యిందా? లేక హీరోయిన్ అయ్యాక పాటలు పాడుతుందా? తెలియదు కానీ చిన్నప్పటి నుండే మ్యూజిక్‌ను నేర్చుకుంది. ఆ తర్వాత చిన్నప్పుడే కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు, ఆన్ స్క్రీన్ సింగింగ్ షోలలో పాల్గొనడం కూడా చేసింది. అయితే తాజాగా తను ఒక వీడియోను షేర్ చేస్తూ ‘నా నిజమైన డెబ్యూ’ అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో పరిణీతి వయసు చాలా చిన్నది. తను మరికొందరు అమ్మాయిలతో కలిసి దూరదర్శన్‌లో పాటలు పాడుతోంది. ఇది చూసిన ప్రేక్షకులు.. పరిణీతి చిన్నప్పటి నుండే సింగింగ్‌లో దిట్ట అని కామెంట్స్ చేస్తున్నారు.






రియల్ సింగర్‌గా..


పరిణీతి చోప్రా మొదట్లో తన సినిమాల్లో మాత్రమే కవర్ సాంగ్స్ పాడుతూ యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌లో కూడా బెస్ట్ అనిపిస్తూ చాలామందిని మెప్పించింది. ఇక తాజాగా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘చమ్కీలా’తో తను ఏ రేంజ్‌లో పాడగలదు అని పరిణీతి నిరూపించింది. 1980ల్లో పంజాబ్‌లో డబుల్ మీనింగ్ పాటలు పాడుతూ ఓ రేంజ్‌లో ఫేమస్ అయిన అమర్ సింగ్ చమ్కీలా అనే సింగర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో చమ్కీలా పాత్రలో పంజాబీ సింగర్ దిల్‌జిత్ దోసాంజ్ నటించాడు. తన భార్య అమర్‌జోత్ పాత్రలో పరిణీతి చోప్రా కనిపించింది. దిల్‌జిత్ దోసాంజ్ ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా సింగర్‌గా నటించడం తనకు పెద్ద కష్టమేమి కాదు. కానీ పరిణీతి ఒక సింగర్‌గా నటించి అందరి చేత ప్రశంసలు పొందింది.


కాన్సర్ట్ కూడా..


‘చమ్కీలా’ సినిమాలో దిల్‌జిత్, పరిణీతి కలిసి పాడిన పాటలు అన్నీ లైవ్‌గా రికార్డ్ చేశాడు దర్శకుడు ఇంతియాజ్ అలీ. అంటే సినిమాలో ప్రేక్షకులకు వినిపించేది దిల్‌జిత్, పరిణీతి స్వయంగా తమ గొంతుతో పాడిన పాటలే. దీంతో పరిణీతి చోప్రాలో ఇంత టాలెంట్ ఉందా అని ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా జనవరిలో ఒక లైవ్ కాన్సర్ట్‌ను కూడా ఏర్పాటు చేసి తన గొంతుతో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించింది. ముంబాయ్‌లో జరిగిన ఈ కాన్సర్ట్‌కు ఎంతోమంది ప్రేక్షకులు హాజరయ్యారు. వారంతా పరిణీతి సింగింగ్ టాలెంట్‌ను లైవ్‌లో చూసి ఫిదా అయ్యారు.



Also Read: ఎదురుచూపు ముగిసింది.. ఓటీటీలోకి వచ్చేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?