ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెలలోనే రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ తో పాటు ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. 200 మందికి పైగా అతిథులు ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. వీరు బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 మందికి పైగా వివిఐపి అతిథులు కూడా వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు హోటళ్లలో వివాహ వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ సహా పలువురు హాజరుకానున్నారు. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రానున్నారు.
పరిణీతి పెళ్లికి అంతా రెడీ
సెప్టెంబర్ 23న హల్దీ, మెహందీ, సంగీత్ తో వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. లీలా ప్యాలెస్, ఉదయవిలాస్‌తో పాటు సమీపంలోని మూడు హోటళ్లను కూడా పరిణీతి, రాఘవ్ కుటుంబ సభ్యులు బుక్ చేశారు. వీవీఐపీ అతిథులు వచ్చే అవకాశం ఉండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయపూర్‌కు వెళ్లి హోటళ్లను చూశారు. అన్నీ ఓకే అనుకున్నాకే బుక్ చేశారు.
పెళ్లి మూడ్ లోకి వెళ్లిపోయిన పరిణీతి
ప్రస్తుతం పరిణీతి చోప్రా పెళ్లి మూడ్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసింది. ఆమె తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్‘ షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాల విషయాన్ని పక్కన పెట్టి కుటుంబతో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. రెండు మూడు రోజుల్లో పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు వెళ్లనున్నట్లు తలుస్తోంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పెళ్లి జరగనుంది.
పెళ్లి గురించి రాఘవ్ ఏమన్నారంటే?
త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. “పరిణీతితో పెళ్లి మాయాజాలంలా అనిపిస్తోంది. నా జీవిత భాగస్వామిలా ఆమె రావడం సంతోషంగా ఉంది. తన లాంటి అమ్మాయిని భార్యగా పంపింపించబోతున్న దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను” అని రాఘవ్ వెల్లడించారు.
ఇక ప్రస్తుతం పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘మిషన్ రాణిగంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 1989 రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ డిజాస్టర్ సమయంలో 65 మంది మైనర్లను రక్షించిన ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అటు ఇంతియాజ్ అలీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘చమ్కిలా’లో కూడా ఆమె కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.
Read Also: మూవీ చూడండి, అనుష్కతో మాట్లాడండి - ప్రేక్షకులకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మేకర్స్ బంఫర్ ఆఫర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial