''అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ (ఇండియాలో) సినిమా నిర్మించిన కేకే రెడ్డి గారికి, వారి మిత్రులకి ఆల్ ది బెస్ట్. అక్కడ ఉండి ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ప్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు'' అని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అన్నారు. యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్, అజయ్, శతాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'ఇంద్రాణి'. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కించారు. స్టీఫెన్ పల్లం దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా రూపొందుతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
'ఇంద్రాణి' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ, ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ట్రైలర్ విడుదల తర్వాత మణిశర్మ మాట్లాడుతూ ''కేకే రెడ్డి, స్టీఫెన్, స్టాన్లీ, జైసన్ నా మిత్రులు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. 'ఇంద్రాణి' పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్టర్ చూడగానే డైరెక్టర్ విజన్ అర్ధమైంది. ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఉంది. వారి కష్టం, ఖర్చు... రెండు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తున్నారు. మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ''ఇంద్రాణి' ట్రైలర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తీక్ అండ్ మూవీ టీమ్'' అని మణిశర్మ అన్నారు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ భామ - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ఫాదర్!
చిత్ర దర్శకుడు స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ... ''ఈ కథ అనుకున్నప్పుడే చిత్రాన్ని పెద్దగా చేద్దామని అనుకున్నాను. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. 2.40 గంటల విజువల్ వండర్. టైమ్ మెషిన్, రోబో... సినిమాలో ప్రతీది కీలకమే. రాబోయో 50 సంవత్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందనేది చూపించా. ఈ సినిమా యువతరానికి చాలా స్పూర్తిదాయకంగా ఉంటుంది'' అని అన్నారు. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ... ''ఇంద్రాణి' ట్రైలర్ చూస్తుంటే దర్శక నిర్మాతల కష్టం కనిపిస్తుంది. అదిరిపోయే నేపథ్య సంగీతం ఇవ్వాలని రెడీ అవుతున్నా. సూపర్ మేన్ మూవీ లాగా సూపర్ ఉమెన్ మూవీ ఇది. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
స్టాన్లీ పల్లం మాట్లాడుతూ... ''నా బ్రదర్ స్టీఫెన్ కోవిడ్ టైంలో నాకు ఈ కథ చెప్పాడు. ఆ తర్వాత మా శ్రేయోభిలాషుల సహాయంతో మేమే సినిమా నిర్మించాం. షూటింగ్ పూర్తయ్యాక కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏడాది కష్టపడ్డాడు స్టీఫెన్. క్లైమాక్స్‌లో ఏం జరగబోతుంది అనేది ఊహించడం చాలా కష్టం. అంత అద్భుతమైన కథ. సాయి కార్తీక్ సింగిల్ సిట్టింగ్స్‌లో మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్'' అని అన్నారు. సహ నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ... ''స్టీఫెన్ గారు ఒక గొప్ప బాధ్యత తీసుకుని ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సూపర్ ఉమెన్ ట్రైలర్ ప్రేక్షకులు అందరికీ నచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.
ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: స్టాన్లీ పల్లం, కళా దర్శకుడు: రవి కుమార్ గుర్రం, కూర్పు: రవి తేజ కుర్మాణ, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, యాక్షన్ డైరెక్టర్: ప్రేమ్ సన్, సహ నిర్మాతలు: సుధీర్ వేల్పుల, కేకే రెడ్డి - జైసన్, రచన - దర్శకత్వం - నిర్మాత: స్టీఫెన్ పల్లం.