సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మళ్లీ పెళ్లి' రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసింది. పవిత్ర లోకేష్ ను నరేష్ మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఇద్దరూ కలిసి 'మళ్లీ పెళ్లి' అనే టైటిల్ తో సినిమా తీయడం, ట్రైలర్ కూడా వీళ్ళ రియల్ లైఫ్ కథనే సినిమాగా తీసినట్లు కనిపించడంతో ఈ సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. కానీ విడుదలైన తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంతా తెలిసిన స్టోరీ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. గత కొద్ది కాలంగా నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సీనియర్ నటి జయసుధ, శరత్ బాబు, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ, రవివర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.


కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. అయితే థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ ఆహా లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం కేవలం ఆహా ఓటీటీలోనే కాకుండా మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


జూన్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఆహా లో కూడా అదే రోజు(జూన్ 23) ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి అందుబాటులోకి రానుందన్నమాట. సో ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు జూన్ 23న ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూసేయొచ్చు. కాగా విజయ్ కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని స్వయంగా నరేష్ నిర్మించడం విశేషం.


సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఎం ఎం బాల రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, జునైద్ సిద్ధిక్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక మళ్లీ పెళ్లి కథ విషయానికొస్తే.. సినీ నటుడు నరేందర్ (నరేష్) వైవాహిక జీవితం గొడవలతోనే నిండిపోయి ఉంటుంది. ఇక విభేదాల కారణంగా సౌమ్య సేతుపతికి నరేందర్ దూరంగా ఉంటాడు. అతని జీవితంలో మరో నటి పార్వతి ఎలా వచ్చింది? వారి ప్రేమ బంధానికి సొసైటీ తో పాటు సౌమ్యసేతుపతి నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాయి? వాటన్నిటినీ ఎదుర్కొని నరేందర్, పార్వతిల ప్రేమ బంధం సఫలం అయిందా? లేదా అనేదే ఈ సినిమా కథ. సీనియర్ హీరో నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలనే ఈ సినిమాలో చూపించారు. కానీ రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ లోనే మూవీ ఉండడంతో ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. మరి థియేటర్స్ లో సక్సెస్ కాలేకపోయినా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.