ఆస్కార్... అదొక గౌరవం, ప్రతిష్ట. సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటీనటులుగా పేరు తెచ్చుకున్న స్టార్స్ కూడా కలలుకనే అవార్డు. అలాగే భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఫిలిం మేకర్ ఎదురుచూసే అరుదైన గౌరవం ఆస్కార్. రీసెంట్ గా 97 అకాడమీ అవార్డుల నామినేషన్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో భారతదేశం నుంచి 'అనూజ' అనే షార్ట్ ఫిలిం నామినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక 'ఆస్కార్' అవార్డు అనగానే తళతళ మెరిసే 24 క్యారెట్ల బంగారు విగ్రహం కళ్ళ ముందు మెరుస్తుంది. మరి ఆ విగ్రహం ఎవరిది? అసలు ఈ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఆస్కార్ అనేది సినిమా ప్రపంచంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి కల. భారతదేశంలో పాటు ప్రపంచంలోని ప్రతి సినిమా ఇండస్ట్రీ కనీసం ఒక్కసారైనా ఈ మెరిసే ట్రోఫీని అందుకోవాలని కోరుకుంటుంది. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పటికీ చాలామందికి తెలియదనే చెప్పాలి.
ట్రోఫీని డిజైన్ చేసింది ఎవరు?
ప్రపంచంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల వేడుక 1929 మే 16న మొదలైంది. ఈ ఈవెంట్ కాలిఫోర్నియాలోని రూజ్ వెల్ద్ అనే హోటల్లో జరిగింది. అప్పట్లో ఈ అవార్డును 'అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్' అని పిలిచేవారు. ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి రెండేళ్ల ముందే ట్రోఫీని తయారు చేయాలని ఆలోచన మొదలైంది.
1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మీటింగ్ లో ఫస్ట్ టైం ట్రోఫీ డిజైన్ గురించి చర్చ వచ్చింది. ఆ టైంలోనే లాస్ ఏంజిల్స్ నుంచి ఎంతోమంది కళాకారులు ట్రోఫీకి సంబంధించిన డిజైన్లను తీసుకొచ్చారు. అయితే అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండగా, శిల్పి జార్జ్ స్టాన్లీ తయారు చేసిన విగ్రహం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది ఇదే ఆస్కార్ ట్రోఫీగా సెలెక్ట్ అయింది. సమాచారం ప్రకారం మెక్సికెన్ చిత్ర నిర్మాత, నటుడు ఎమీలియో ఫెర్నాండెజ్ ఈ ట్రోఫీ డిజైన్ కి ఇన్స్పిరేషన్. అందుకే ఈ విగ్రహం ఫెర్నాండెజ్ ది అని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్కార్ విగ్రహ రూపం ఫెర్నాండెజ్ ది అన్నమాట.
ఎమిలియో ఫెర్నాండెజ్ ఎవరు?
1904లో మెక్సికోలోని కోహియిలాలో జన్మించిన ఎనీలియో ఫెర్నాండెజ్ మెక్సికన్ విప్లవం సమయంలో పెరిగి పెద్దయ్యాడు. హై స్కూల్ డ్రాప్ అవుట్ అయిన ఆయన తిరుగుబాటుదార్ల నాయకుడు కూడా అయ్యాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, శిక్ష వేశారు. అయితే ఆయన అక్కడి నుంచి పారిపోయి హాలీవుడ్లో పని చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆయనకి సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఆ టైంలో మూకీ సినిమా స్టార్ డోలోరెస్ డెల్ రియో... ఫెర్నాండెజ్ కి 'ఎల్ ఇండియో' అని పేరు పెట్టారు. ఇక ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో తిరిగి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
Also Read: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?
ఆస్కార్ ఐకానిక్ పోజ్ వెనకున్న స్టోరీ
ఎమిలియో ఫెర్నాండెజ్ తన సినీ ప్రయాణంలో ఆర్ట్ డైరెక్టర్, అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' సభ్యుడు సెడ్రిక్ గిబ్బన్స్ భార్యకు ఫ్రెండ్ అయ్యాడు. ఆ సమయంలో విగ్రహరూప కల్పన కోసం పని చేస్తున్న గిబ్బన్స్ ను ఆమె ఫెర్నాండెజ్ ను పరిచయం చేసింది. ఇక ఈ ఫ్రెండ్షిప్ కారణంగా ఫెర్నాండెజ్ ను 8.5 పౌండ్ల బరువున్న ట్రోఫీకి స్కెచ్ కోసం ఫోజులు ఇవ్వమని అడిగాడట గిబ్బన్స్. అప్పట్లో ఫెర్నాండెజ్ అయిష్టంగానే ఫోజులు ఇచ్చినప్పటికీ, అదే ఆ తర్వాత ఐకానిక్ పోజ్ గా మారింది.. ఇక ఈ ట్రోఫీని జార్జ్ స్టాన్లీ రూపొందించగా, 1929లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఫస్ట్ ఆస్కార్ వేడుకలో అదే ట్రోఫీని అందజేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే ట్రోఫీని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఆస్కార్ విజేత ఈ ట్రోఫీని మరెక్కడా అమ్ముకునే అవకాశం లేకుండా రూల్ పెట్టారు.