Oscar Academy Introduced Stunt Desing Category: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీని అకాడమీ చేర్చింది. ఇక మీద నుంచి 'స్టంట్ డిజైన్' (Stunt Design) జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2027 నుంచి రిలీజ్ కానున్న మూవీస్ ఈ విభాగంలో పోటీ పడొచ్చని తెలిపింది. 2028 నుంచి ఈ కేటగిరీలో ఎంపిక చేసి ఆస్కార్ అవార్డులు అందించనున్నట్లు వెల్లడించింది.
100వ అకాడమీ అవార్డుల్లో..
2028లో జరగబోయే 100వ అకాడమీ అవార్డుల్లో ఈ జాబితాను అధికారికం చేయనున్నట్లు అకాడమీ నిర్వాహకులు తెలిపారు. 'సినిమా ప్రారంభం నుంచి చిత్ర నిర్మాణంలో 'స్టంట్ డిజైన్' భాగంగా మారింది. క్రియేటివిటీ కలిగిన కళాకారులను ఈ కేటగిరీలో వినూత్నంగా గౌరవించడం మాకు గర్వంగా ఉంది.' అని పేర్కొన్నారు. ఈ మేరకు స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అకాడమీ రిలీజ్ చేసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 4 సినిమాలు - చూసి ఎంజాయ్ చేసెయ్యండి!
పోస్టర్‌లో ఆర్ఆర్ఆర్ డిజైన్
స్టంట్ డిజైన్ కొత్త పోస్టర్‌లో 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు మరో గౌరవం దక్కింది. హాలీవుడ్ సినిమాల సరసన మన తెలుగు సినిమాను చేర్చింది. 3 సినిమాల పోస్టర్‌తో ఆస్కార్ స్టంట్ డిజైన్ కేటగిరీ నుంచి వివరాలు వెల్లడించింది. 'ఆర్ఆర్ఆర్', 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్', 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాల్లోని స్టంట్స్ ఇమేజెస్‌తో ఈ పోస్టర్‌ను షేర్ చేసింది. దీంతో తెలుగు ఆడియన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
100 ఏళ్ల నిరీక్షణ..
ఆస్కార్ అకాడమీ స్టంట్ డిజైన్ కేటగిరీ ప్రకటించడం, పోస్టర్‌లో 'ఆర్ఆర్ఆర్' స్టంట్ డిజైన్‌గా వేయడంపై దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) స్పందించారు. 100 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని.. 2027 నుంచి రిలీజ్ అయ్యే చిత్రాలకు కొత్తగా స్టంట్ డిజైన్‌లోనూ అవార్డులు రానున్నాయని అన్నారు. 'దీన్ని సాధ్యం చేసినందుకు ఆస్కార్ అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయానికి కారకులైన డేవిడ్ లెయిచ్, క్రిస్ ఓ హర, అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, అలాగే స్టంట్ నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. పోస్టర్ డిజైన్‌లో 'ఆర్ఆర్ఆర్' విజువల్ చూసి థ్రిల్ ఫీలైనట్లు చెప్పారు.