మెగాస్టార్ చిరంజీవి మరో సారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. పదో తేదీన వీరి మధ్య మరో సారి సమావేశం జరగనందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సారి ఒక్క చిరంజీవి మాత్రమే కాదని టాలీవుడ్ నుంచి కొంత మంది బృందం చిరంజీవి నేతృత్వంలో వస్తుందని భావిస్తున్నారు. వారందరితో జగన్ భేటీ అవుతారు. గత సమావేశంలో చిరంజీవి ఒక్కరే పాల్గొన్నారు. దీని వల్ల అది వ్యక్తిగత సమావేశం అన్న ప్రచారం అయింది. అందుకే ఈ సారి ఎలాంటి అపోహలు లేకుండా టాలీవుడ్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల ప్రతినిధులతో కలిసి చిరంజీవి తాడేపల్లికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌పై స్పష్టత రావడంతో ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో టాలీవుడ్ కి చెందిన అన్ని రంగాల నుంచి ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సమావేశమై ఎజెండా ఖరారు చేసుకోవాలనున్నారు. సోమవారం ఆ సమావేశం జరుగుతుందని టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. కీలకమైన సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల మీటింగ్ నిర్వహించడం లేదని ఛాంబర్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల అంశంలో ఫిలిం చాంబర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో చాంబర్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆథ్యక్షతన జరిగే మీటింగ్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అన్ని విషయాలపై క్లారిటీ తెచ్చుకుంటారని అనుకున్నారు. అయితే మంగళ, బుధవారాల్లో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో టిక్కెట్ల అంశానికి పరిష్కారం దొరుకుతుందని టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. కరోనా ధర్డ్ వేవ్ అంత ప్రమాదకరం కాకపోవడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. ఏపీలో ఇటీవల నైట్ కర్ఫ్యూ విధించారు. తెలంగాణలో అసలు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. మరో వైపు పెద్ద సినిమాలు మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇతర చోట్ల ఎలాంటి సమస్యలు లేకపోయినా ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూ.. టిక్కెట్ రేట్ల వంటి సమస్యలు ఉన్నాయి. వీటికి పరిష్కారం దొరకడం లేదు.
హైకోర్టు సూచనలతో ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చలు జరుపుతోంది. టాలీవుడ్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన వారితో మూడు దఫాలుగా చర్చలు జరిపింది. పదో తేదీన హైకోర్టులో ఈ అంశంపై విచారణ కూడా ఉంది. ఈ క్రమంలో ఓ పరిష్కారానికి రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి బృందానికి పిలుపు వచ్చినట్లుగా భావిస్తున్నారు.