బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో రీసెంట్ గా నటించిన 'ఓ మై గాడ్ 2' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుని పర్వాలేదనిపించింది. విడుదలకు ముందు ఈ సినిమా పలు వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెన్సార్ టీం ఈ సినిమాకి 'A' సర్టిఫికెట్ జారీ చేయడం అందరిని షాక్‌కు గురి చేసింది. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు ఉండడంతో సెన్సార్ టీం చాలా సీన్స్‌ను తొలగించింది. అయితే తాజాగా ఇదే విషయం గురించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో దర్శకుడు అమిత్ రాయ్ 'సెన్సార్ తమ సినిమాకి 'A' సర్టిఫికెట్ జారీ చేయడం తనను ఎంతగానో బాధించిందని, కానీ ఓటిటిలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అన్ కట్ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.


ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో అమిత్ రాయ్ మాట్లాడుతూ.."ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని రూపొందించాం. కానీ సెన్సార్ 'A' సర్టిఫికెట్ జారీ చేయడంతో మా హృదయం బద్దలైంది. మాకు U/A సర్టిఫికెట్ ఇవ్వమని సెన్సార్ టీం ని ఎంతో రిక్వెస్ట్ చేశాం. కానీ వాళ్లు వినలేదు. చివరివరకు వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులతోనే ఈ చిత్రం విడుదల చేశాం’’ అని అన్నారు. 'ఓ మై గాడ్ 2' ఓటీటీ రిలీజ్ ఎటువంటి కట్స్ లేకుండా విడుదల అవుతుందా? అని అడిగినప్పుడు "మా సినిమాను జనాలు ఆదరించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలో స్వచ్ఛమైన సోల్ ఉంది. సినిమా యొక్క మెయిన్ థీమ్ కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆడియన్స్ మా సినిమాని ఇష్టపడ్డారు. మేము సినిమాలో రియాలిటీ గురించి మాట్లాడాం. ఆ రియాలిటీని స్వీట్ అండ్ హ్యూమరస్ వేలో ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో సినిమాను ప్రజెంట్ చేశాం" అంటూ అమిత్ రాయ్ చెప్పుకొచ్చారు.


మొత్తం మీద సెన్సార్ కట్స్ తో థియేటర్స్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న 'ఓ మై గాడ్ 2' ఇప్పుడు  అన్ కట్ వెర్షన్ తో ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం జియో సినిమా ఏకంగా రూ.150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ గా రిలీజ్ తర్వాత 8 వారాలకు జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకి అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ఈ చిత్రం జియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఇక అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ పోషించారు. సినిమాలో కొడుకు కోసం పోరాడే తండ్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ యామి గౌతమ్ కూడా లాయర్ పాత్రలో ఆకట్టుకుంది. 2012లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే రూ.10 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.


Also Read : ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'వృషభ' - జెట్ స్పీడ్‌లో రోహన్, మోహన్ లాల్ సినిమా షూటింగ్!









Join Us on Telegram: https://t.me/abpdesamofficial